సుప్రీంకోర్టు ముందుకు కంచ గచ్చిబౌలి భూముల కేసు.. విచారణ జరపనున్న సీజేఐ బీఆర్ గవాయ్​ బెంచ్

సుప్రీంకోర్టు ముందుకు కంచ గచ్చిబౌలి భూముల కేసు.. విచారణ జరపనున్న సీజేఐ బీఆర్ గవాయ్​ బెంచ్
  • విచారణ జరపనున్న సీజేఐ బీఆర్ గవాయ్​ బెంచ్ 
  • విచారణ జాబితాలో మొదటి కేసుగా మెన్షన్

న్యూఢిల్లీ, వెలుగు: కంచె గచ్చిబౌలిలోని 400 ఎరాల భూ వ్యవహారంపై సుమోటోగా దాఖలైన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. నూతన సీజేఐ బీఆర్ గవాయి బెంచ్ ఈ కేసును విచారించనుంది. ఈ మేరకు గురువారం చేపట్టబోయే విచారణ జాబితాలో కోర్టు నంబర్ 1 (సీజేఐ బెంచ్) లో మొదటి కేసుగా ప్రియార్టీ కల్పించారు. గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) రిపోర్ట్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.

అప్పటి వరకు 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై స్టేటస్ కో కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ గడువు నేటితో ముగియనుంది. కంచె గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్‌‌‌‌‌‌‌‌ ది ఛేంజ్‌‌‌‌‌‌‌‌ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు సార్లు ఈ కేసు విచారణకు రాగా.. ధర్మాసనం ప్రధానంగా చెట్ల నరికివేతపైనే ఫోకస్ పెట్టింది. అలాగే, స్థానికంగా జీవిస్తున్న జంతుజాలాల పరిరక్షణ ను ప్రియార్టీగా తీసుకుంది.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)దా? ఈ భూమిలో ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్ట్ లు చేబట్టబోతోంది? అనే వివరాల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. స్థానిక పర్యావరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణ ను చేపట్టనుంది. ఈ దిశలో ఇప్పటికే పర్యావరణ, జీవావరణాన్ని కాపాడేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తోన్నట్టు వెల్లడించింది.

అంతకన్నా ముందు తెలంగాణ ప్రభుత్వ వైల్డ్ లైఫ్ వార్డెన్ లు చెట్టు నరికిన 100 ఎకరాల్లో జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ 100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్య ప్రాణులను పరిశీలించి, వాటిని రక్షించడానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిగా జస్టిస్ బీఆర్ గవాయి ఈ కేసును విచారించారు. బుధవారం నూతన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ బీఆర్ గవాయి.. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో  ఈ కేసు విచారణను చేపట్టనున్నారు.