కరోనా ఎఫెక్ట్: సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. సోమవారం నుంచి అత్యవసర కేసులను మాత్రమే విచారణకు తీసుకోవాలని నిర్ణయించింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండడంతో విచారణ సమయంలో కోర్టు హాల్‌లోకి కేసుకు సంబంధించిన లాయర్, లిటిగెంట్స్ తప్ప మరెవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ కోసం సుప్రీం కోర్టు నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులపై నిన్న సాయంత్రం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే… పలువురు న్యాయమూర్తులు, లాయర్లు, కేంద్ర ఆరోగ్య, న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం హోళీ సెలవుల్లో ఉన్న సుప్రీం కోర్టు సోమవారం నుంచి తిరిగి విచారణలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కోర్టు హాలులోకి జనాల రాకను తగ్గించేందుకు పై నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని కేసుల్లో అవసరమైతే టెక్నాలజీ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నిందితుల విచారణ వంటివి చేపట్టవచ్చని సీజేఐ అభిప్రాయపడ్డారు.

 రాష్ట్రాలు అప్రమత్తం

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే దాదాపు 110కి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 35 వేల మందికిపైగా వైరస్ సోకింది. సుమారు 5000 మంది కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 81 మందికి వైరస్ సోకి చికిత్స పొందుతుండగా.. కర్ణాటకకు చెందిన ఒక వ్వక్తికి మరణించాడు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విదేశీయులు భారత్‌లోకి రాకుండా ఏప్రిల్ 15 వరకు వీసాలను సస్పెండ్ చేసింది. అన్ని రకాల పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేయాలని ఆదేశించింది. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, మాల్స్ మూసేస్తూ పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

More News:

కరోనా ఎఫెక్ట్: స్కూళ్లు, కాలేజీల మూత.. పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలన్న ప్రభుత్వాలు

రేప్ బాధితురాలి తండ్రి హత్య కేసు: కులదీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

Latest Updates