అయోధ్య కేసు: ఉదయం 10.30కి  సుప్రీం తుది తీర్పు.. కేంద్రం హై అలర్ట్

న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద భూమి కేసు తుది తీర్పును సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శనివారం ఉదయం వెల్లడించబోతోంది. దాదాపు 40 రోజుల పాటు రోజు వారీ విచారణ తర్వాత అక్టోబరు 16న వాదనలను ముగించి.. తీర్పును వాయిదా వేసిన కోర్టు ఉదయం 10.30కి తీర్పు ఇస్తోంది.తీర్పు ఎలా ఉన్నా అందరూ శాంతియుతంగా ఉండాలని అన్ని పార్టీలూ కోరుతున్నాయి. ఇప్పటికే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం హోం శాఖ హై అలర్ట్ ప్రకటించి.. భారీగా భద్రత ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచనలు కూడా చేసింది. అయోధ్యలో 4 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించింది.

2010లో అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని మూడు ప్రధాన పార్టీలైన రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖారాలకు సమానంగా పంచుతూ తీర్పు ఇచ్చింది. దానిపై ఏ ఒక్క పిటిషనర్ కూడా సంతృప్తి చెందలేదు. సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన ఓ నిర్ణయానికి రావాలని కోర్టు బయట మధ్యవర్తిత్వానికి అనుమతిచ్చినా అదీ ఫెయిల్ కావడంతో సుప్రీం రోజువారీ విచారణ చేపట్టింది. సుదీర్ఘ కాలంగా నలుగుతున్న వివాదాన్ని ఓ ముగింపు దిశగా.. ఇప్పుడు తుది తీర్పు రాబోతోంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని  ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం అత్యంత సెన్సిటివ్ కేసు తీర్పు ఇస్తోంది.

Latest Updates