15 రోజుల్లో వ‌ల‌స కూలీల్ని స్వ‌స్థ‌లాల‌కు చేర్చండి: సుప్రీం కోర్టు

మ‌రో 15 రోజుల్లో వ‌ల‌స కార్మికులంద‌రినీ వారి స్వ‌స్థలాల‌కు చేర్చాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది సుప్రీం కోర్టు. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయి ప‌నులు లేక ఇబ్బందులు ప‌డుతూ సొంతూరికి చేర‌డానికి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో గ‌తంలో సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న సుప్రీం కోర్టు మే 28న వ‌ల‌స కూలీల నుంచి ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌కుండా వారిని స్వ‌స్థలాల‌కు చేర్చాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వారికి ఆహారం, తాగు నీటి స‌దుపాయాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయాల‌ని సూచించింది. ఇదే పిటిష‌న్ పై శుక్ర‌వారం మ‌రోసారి జ‌స్టిస్ అశోక్ భూష‌న్, జ‌స్టిస్ ఎస్కే కౌల్, జ‌స్టిస్ ఎంఆర్ షా ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. వ‌ల‌స కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చేందుకు జూన్ 3 వ‌ర‌కు 4200 శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్లు న‌డిపామ‌ని కేంద్రం త‌ర‌ఫున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు వివ‌రించారు. దాదాపు కోటి మందికి పైగా వ‌ల‌స కూలీల‌ను వారి సొంతూర్ల‌కు చేర్చామ‌న్నారు. ఇంకా వ‌ల‌స కూలీలు మిగిలి ఉంటే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని రైళ్లు కావాల‌న్న స‌మాచారం కేంద్రానికి ఇస్తే ఆ ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి.. 15 రోజుల్లో వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని సూచించింది.

Latest Updates