మీ విగ్రహాలకు మీరే పైసలు కట్టండి : మాయావతికి సుప్రీం ఆదేశం

ఏప్రిల్ 2కు విచారణ వాయిదా

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రజాధనంతో ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఆ సొమ్మునంతా తిరిగి చెల్లించాల్సిందేనని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో, నోయిడాలోని పార్కుల్లో మాయావతి తన విగ్రహంతో పాటు పార్టీ గుర్తయిన ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు.  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ 2009లో ఇద్దరు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను శుక్రవారం ధర్మాసనం విచారించింది.

“ప్రజాధనం ఉపయోగించి మాయావతి, ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఖర్చు పెట్టిన ఆ ప్రజల సొమ్మునంతా డిపాజిట్ చేయాల్సిందే . మీ సొంత డబ్బులు కట్టండి ” అని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.

Latest Updates