టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్

అడ్జెస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌) బకాయిల చెల్లింపు విషయంలో టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరటా దొరకలేదు. బకాయిలు కట్టనందుకు జడ్జీలు టెల్కోలపై, డాట్​పై మండిపడ్డారు. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డాట్‌‌ ఆఫీసర్లను నిలదీశారు.  దీంతో బకాయిలు వెంటనే కట్టాలని డాట్​ టెల్కోలను ఆదేశించింది. ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియాపై కోర్టను ధిక్కరించినట్టుగా కోర్టు తేల్చింది. తదుపరి విచారణ జరిగే మార్చి 17న టెల్కోల, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికం (డాట్‌‌) ఎండీ, టాప్‌‌ అఫీషియల్స్‌‌ స్వయంగా రావాలని ఆదేశించింది. టెల్కోలు ఈ ఏడాది జనవరి 23 నాటికి రూ.లక్ష కోట్లకుపైగా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలంటూ తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదంటూ డాట్‌‌ను కోర్టు మందలించింది. ‘‘డాట్‌‌ కోర్టు తీర్పును పాటించలేదు. బకాయిలు చెల్లించని కంపెనీలను ఏమీ అనలేదు. అసలు ఇలాంటి అర్థపర్థం లేని పనులు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో డెస్క్‌‌ ఆఫీసర్‌‌ స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పాలి. డాట్‌‌ ఆర్డర్‌‌ను డెస్క్‌‌ ఆఫీసర్‌‌ శుక్రవారం సాయంత్రం లోపు వెనక్కి తీసుకోకుంటే ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది. ఆఫీసర్లు తమ పరిమితులను తెలుసుకోవాలి. ఆయన వైఖరి కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది’’ అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

మరింత సమయం కోరిన టెల్కోలు..

బకాయిల చెల్లింపునకు తమ దగ్గర డబ్బులు లేవంటూ టెల్కోలు ఏజీఆర్‌‌ బకాయిలను కట్టనప్పటికీ, ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు మరింత సమయం కావాలని ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా గతంలో కోరాయి. ఏజీఆర్‌‌ లెక్కింపు విధానంపై టెల్కోలు, డాట్‌‌ మధ్య 14 ఏళ్లపాటు న్యాయపోరాటం జరిగింది. డివిడెండ్‌‌, కిరాయి, వడ్డీలు కూడా ఏజీఆర్‌‌లో భాగమేనని డాట్‌‌ చేస్తున్న వాదనను టెల్కోలు అంగీకరించలేదు. ఏజీఆర్‌‌ బకాయిల్లో వీటిని చేర్చాలని డాట్‌‌ కోరింది. డాట్‌‌ రూల్స్‌‌ ప్రకారం ప్రతి టెల్కో తన లైసెన్సుఫీజులో ఎనిమిది శాతం మొత్తాన్ని ఏజీఆర్‌‌గా చెల్లించాలి. దీంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. నాన్ టెలికాం రెవెన్యూలు కూడా వ్యాపారాల్లో భాగమేనని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం…వొడాఫోన్‌‌ ఐడియా రూ.50 వేల కోట్లు, ఎయిర్‌‌టెల్‌‌ రూ.35,586 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌‌ రూ.14 వేల కోట్లు ఏజీఆర్‌‌గా చెల్లించాలి. జియో ఇది వరకే బకాయిలుగా రూ.60 కోట్లు కట్టేసింది. ఇది 2016లోనే కార్యకలాపాలు మొదలుపెట్టినందున, బకాయిలు తక్కువగా ఉన్నాయి. ఎయిర్‌‌టెల్‌‌ కూడా చెల్లింపుల కోసం నిధులు సేకరించినా, వొడాఫోన్‌‌ మాత్రం తన వల్ల కాదని చేతులెత్తేసింది. బకాయిల చెల్లింపు గడువు పెంచాలంటూ ఇవి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. మరో విషయం ఏమిటంటే, ఇంటర్నల్‌‌ కమ్యూనికేషన్‌‌, సిగ్నలింగ్‌‌ కోసం లైసెన్సులు పొందిన టెలికామేతర కంపెనీలు కూడా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కంపెనీలు టెలికం సేవలు అందించకపోయినా బకాయిలు కట్టకతప్పదని తెలిపింది. దీంతో రూ.1.72 లక్షల కోట్లు కట్టాలని గెయిల్‌‌కు, రూ.48 వేల కోట్లు కట్టాలని ఆయిల్‌‌ ఇండియాకు, రూ.22,168 చెల్లించాలని కోరుతూ పవర్‌‌గ్రిడ్‌‌కు, రూ.15,019 కోట్లు కట్టాలంటూ గుజరాత్‌‌ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్‌‌కు, రూ.5,841 కోట్లు కట్టాలంటూ ఢిల్లీ మెట్రోరైల్‌‌ కార్పొరేట్ లిమిటెడ్‌‌కు డాట్‌‌ నోటీసులు పంపింది. ఇది చాలా పెద్దమొత్తమంటూ ఈ కంపెనీలు అభ్యంతరం తెలిపాయి. ఏజీఆర్‌‌ విషయంలో ఊరట దొరక్కపోతే, వ్యాపారం మూసివేస్తామని వొడాఫోన్‌‌ ఐడియా గతంలోనే ప్రకటించింది.

అర్థరాత్రిలోపే చెల్లించాలన్న డాట్‌‌

కోర్టు తీర్పుపై స్పందించిన డాట్‌‌ శుక్రవారం 11.59 గంటలలోపులోపు ఏజీఆర్‌‌ , స్పెక్ట్రమ్‌‌ యూసేజ్‌‌ బకాయిలన్నింటినీ చెల్లించాలని వొడాఫోన్‌‌ ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌లను ఆదేశించింది. బకాయిలు కట్టని టెల్కోలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గత నెల 23న జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. తీర్పుపై ఎయిర్‌‌టెల్‌‌ స్పందిస్తూ కోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని, ఈ నెల 20లోపు రూ.10 వేల కోట్లు జమచేస్తామని ప్రకటించింది. మిగతా మొత్తాన్ని మార్చి 17లోపు కట్టేస్తామని వివరణ ఇచ్చింది. 22 సర్కిళ్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించడానికి సమయం పడుతుందని తెలియజేసింది. ఇది వరకే వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న టెల్కోలకు సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర ఇబ్బందికరమేనని టెలికాం ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించకపోతే వొడాఫోన్‌‌ ఐడియా మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే జరిగితే ఇండియాలో రెండే కంపెనీలు మిగులుతాయని, వాటి మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

Latest Updates