ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌లో సర్వేయర్ల దందా!..రూ 5 వేల దాకా వసూళ్లు

  • ఒక్కో అప్లికేషన్‌‌కు రూ.5 వేల దాకా వసూళ్లు
  • పాత రూల్స్​ చెప్తూ సొమ్ము చేసుకుంటున్న తీరు
  • ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చని తెలియని ప్లాట్ల ఓనర్లు
  • అవగాహన కల్పించని సర్కారు

హైదరాబాద్‌‌, వెలుగు:  లే ఔట్‌‌ రెగ్యులరైజేషన్‌‌ స్కీం (ఎల్ఆర్ఎస్)ను లైసెన్సుడ్‌‌ సర్వేయర్లు దందాగా మార్చుకుంటున్నారు. ఈ స్కీంపై ప్లాట్ల ఓనర్లలో ఉన్న అనుమానాలు, అయోమయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా దండుకుంటున్నారు.ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ కు అప్లై చేయడంలో వారికి సంబంధం లేకున్నా.. ఒక్కో అప్లికేషన్​కు రూ.5 వేల దాకా వసూలు చేస్తున్నారు. రియల్‌‌ ఎస్టేట్‌‌ వాట్సాప్‌‌ గ్రూపులను దీనికి వేదికగా చేసుకుంటున్నారు. డాక్యుమెంట్స్‌‌ తెచ్చిస్తే అన్నీ తామే చూసుకుంటామని, ప్లాట్‌‌ రెగ్యులరైజేషన్‌‌ అయిపోయినట్టేనని నమ్మిస్తున్నారు. ఆన్‌‌ లైన్‌‌లో ఎవరికి వారే అప్లై చేసుకోవచ్చన్న అవగాహన లేని వాళ్లు ఈ ప్రచారాన్ని నమ్మి వేలకువేలు ముట్టజెప్తున్నారు. సర్వేయర్లు వెయ్యి రూపాయల ఫీజు కట్టి.. మిగతా సొమ్ము జేబులో వేసుకుంటున్నారు.

పాత రూల్స్‌‌ చెప్పి దండుకుంటున్నరు

2015లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని అనధికార లే ఔట్లను రెగ్యులరైజ్‌‌ చేయడానికి ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ ప్రకటించారు. 2018లో హెచ్‌‌ఎండీఏ పరిధిలో మరోసారి ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని లైసెన్సుడ్‌‌ సర్వేయర్లు దరఖాస్తుదారుల ప్లాట్‌‌ను చూసి, కొలతలు వేసి, ప్లాట్‌‌ నక్ష గీసిచ్చేవారు. ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ ప్రక్రియలో సర్వేయర్లు ఇచ్చిన ఆ నక్షలను పరిగణనలోకి తీసుకునేవారు. అయితే తాజాగా సర్కారు ప్రకటించిన ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ నోటిఫికేషన్‌‌లో.. రిజిస్టర్డ్‌‌ సేల్‌‌ డీడ్‌‌/ టైటిల్‌‌ డీడ్‌‌ ఫస్ట్‌‌ పేజీ కాపీని సెల్ఫ్‌‌ అటెస్టేషన్‌‌ చేసి అప్‌‌లోడ్‌‌ చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అప్లికేషన్ల గడువు పూర్తయ్యాక సంబంధిత ఆఫీసర్లు ఫీల్డ్‌‌ విజిట్‌‌ చేసి.. సదరు ప్లాట్‌‌ నిషేధిత ఏరియాలో లేదని నిర్ధారణకు వచ్చాక ఎల్ఆర్ఎస్​ ప్రక్రియ చేపడతారు. అప్పుడు మాత్రమే మిగతా డాక్యుమెంట్లు అన్నీ చూపించాల్సి ఉంటుంది. సంబంధిత ప్లాట్‌‌కు కొత్తగా సర్వేయర్‌‌ ఇచ్చే నక్ష కూడా అవసరం లేదు. ప్లాట్‌‌ రిజిస్ట్రేషన్​డాక్యుమెంట్లో పొందుపరిచిన నక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయాలేవీ తెలియని ప్లాట్ల ఓనర్లు.. సర్వేయర్లు చెప్పే మాటలు నమ్మి, అడిగినంత ఇచ్చి ఎల్ఆర్ఎస్​కు అప్లై చేస్తున్నారు.

క్లారిటీ లేక జేబులు గుల్ల

ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌కు ఎలా అప్లై చేసుకోవాలనే విషయంలో ప్లాట్ల ఓనర్లకు క్లారిటీ లేకపోవడంతోనే వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ప్రభుత్వం ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌పై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నామని చెప్తున్నా అది ఎవరికీ చేరడం లేదు. మరోవైపు సోషల్‌‌ మీడియాలో వెల్లువెత్తుతున్న వీడియోలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. దేన్ని నమ్మాలో లేదో తెలియక కన్ఫ్యూజ్‌‌ అవుతున్నారు. ఇది లైసెన్సుడ్‌‌ సర్వేయర్లకు కలిసొచ్చింది. ఇకనైనా క్షేత్రస్థాయిలో జనానికి అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.

మేం చూసుకుంటామంటూ

వరంగల్‌‌ జిల్లా కేంద్రంలో నివసించే కాంట్రాక్టు ఉద్యోగి సుధాకర్‌‌ కొన్నేండ్ల కింద భీమారం శివారులో ఇంటి స్థలం కొన్నారు. ఇప్పుడా జాగాకు ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ అప్లై చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ స్కీంపై అనేక డౌట్స్​ ఉండటంతో తనకు తెలిసిన రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులను వివరాలు అడిగారు. కొద్ది నిమిషాల్లోనే సుధాకర్​ సెల్‌‌ ఫోన్‌‌కు ఒక మెసేజ్‌‌ వచ్చింది. ఆ నంబర్‌‌కు కాంటాక్ట్‌‌ చేయగా.. రిజిస్టర్డ్​ డాక్యుమెంట్‌‌, లింక్‌‌ డాక్యుమెంట్స్‌‌, ఈసీ, ఆధార్‌‌ కార్డ్‌‌, వార్డ్‌‌/ఏరియా నంబర్‌‌, సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ జారీ చేసిన మార్కెట్‌‌ వ్యాల్యూ సర్టిఫికెట్‌‌ తీసుకొస్తే తానే అప్లై చేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. తాను మున్సిపల్‌‌ రిజిస్టర్డ్‌‌ సర్వేయర్‌‌నని, ప్లాట్‌‌ రెగ్యులరైజేషన్‌‌ సర్వేను తానే చూసుకుంటానని.. మొత్తం రూ.5 వేలు ఫీజు అవుతుందని నమ్మించాడు. దీంతో సుధాకర్‌‌ అడిగినంతా ఇచ్చి ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌కు అప్లై చేసుకున్నాడు.

Latest Updates