
డొమెస్టిక్ లెవెల్లో దుమ్మురేపాడు..! ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు..! ముంబై ఇండియన్స్ విజయాల్లో అతనిదే పెద్ద పాత్ర..! అయినా టీమిండియా బెర్త్ మాత్రం దక్కలేదు..! భారీ ఆశలు పెట్టుకున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఆస్ట్రేలియా టూర్‌కు మాత్రం ఎంపిక చేయలేదు..! తన ఈడు కుర్రాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే.. తాను ఆడినా అదృష్టం కలిసి రావడం లేదనే బాధను అదుపు చేసుకుంటూనే.. ముంబైకి ఐదో ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు..! అయితే ఆసీస్ వెళ్లే టీమ్‌లో చోటు దక్కకపోవడంతో చాలా నిరాశకు గురైన సూర్య కుమార్ యాదవ్.. అతను పడిన బాధను, ఆవేదనను పంచుకున్నాడు..!!
ముంబై: ఐపీఎల్–13లో ముంబై ఇండియన్స్‌కు లభించిన అతిపెద్ద స్టార్… సూర్యకుమార్ యాదవ్. 15 ఇన్నింగ్స్‌ల్లో 480 రన్స్ చేయడంతో పాటు కీలక టైమ్‌లో సూపర్ ఫినిషర్‌గా అవతారమెత్తి ఒంటిచేత్తో విజయాలు అందించాడు. అంతకుముందే డొమెస్టిక్ లెవెల్లోనూ తన హవా ఏంటో స్పష్టంగా చూపాడు. దీంతో సహజంగానే ఆస్ట్రేలియా టూర్‌కు సూర్య ఎంపిక అవుతాడని అందరూ భావించారు. కానీ సెలెక్టర్లు కరుణించలేదు. తెర వెనుక ఏం జరిగిందో తెలియకపోయినా.. ఓ కుర్ర ప్లేయర్ జీవితానికి సరిపోయే నిరాశ మాత్రం కలిగించారు. దీంతో కోలుకోలేనంత అగాధంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించిన సూర్యకుమార్‌ను.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ దారిలో పడేశాడు. హిట్‌మ్యాన్ చెప్పిన మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్లీ తన బ్యాట్‌తో పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. అయితే ఏదో ఒకరోజు ఇండియాకు ఆడతానని నమ్మకంతో ఉన్న సూర్య.. ఆ రోజు తన కళ్లలో బాధను రోహిత్ ప్రత్యక్షంగా చూశాడని చెప్పాడు.
‘ఆస్ట్రేలియా టూర్‌కు టీమ్ సెలెక్షన్ జరిగిన రోజు రోహిత్, నేను జిమ్‌లో పక్కపక్కనే కూర్చొని ఉన్నాం. నేను గుడ్‌న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నానని అతనికి తెలుసు. కానీ నేను అనుకున్నది జరగకపోవడంతో నన్ను అలానే కాసేపు చూశాడు. చాలా బాధగా ఉందని నేనే తనకి చెప్పా. కాసేపటి తర్వాత రోహిత్ నాతో మాట్లాడాడు. నువ్వు ప్రస్తుతం టీమ్ (ముంబై)కు ఏమి కావాలో ఆ పనిని సరిగ్గా చేస్తున్నావు. అందువల్ల ఇండియాకు సెలెక్ట్ అవ్వలేదన్న విషయాన్ని పక్కనపెట్టు. ఐపీఎల్ తొలి రోజు నుంచి నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని కోసమే ఆలోచించు. ఈ రోజు కాకపోతే రేపు.. సరైన టైమ్‌లో అవకాశం కచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవద్దు అంటూ రోహిత్ చెప్పడంతో కాస్త ఓదార్పు లభించింది. ఆ టైమ్‌లో రోహిత్ అలా చెప్పడం నాకు బాగా అనిపించింది. నిజానికి నా కళ్లను చూసే రోహిత్ నా సిచ్యువేషన్‌ను అర్ధం చేసుకున్నాడు. ఆ నిరాశలోంచి బయటకు రావడం నా వరకు నిజంగా పెద్ద బూస్టప్’ అని సూర్య పేర్కొన్నాడు.
బిజీగా ఉండాలనుకున్నా..
టీమ్ సెలెక్షన్ గురించి ముందే తెలిసినా.. ఆ రోజు బిజీగా ఉండాలనుకున్నానని సూర్యకుమార్ చెప్పాడు. ‘సెలెక్షన్ జరుగుతుందనే రోజున.. ఆ టెన్షన్ నుంచి తప్పించుకునేందుకు బిజీగా ఉండేందుకు ట్రై చేశా. సెలెక్షన్ వార్త కోసం ఎదురుచూడకుండా.. నా వస్తువులు సరిచేసుకోవడం, జిమ్‌కు వెళ్లడం, టీమ్మేట్స్తో కాలక్షేపం వంటి పనులు చేసేందుకు ప్రయత్నించా. కానీ ఈ రోజు రాత్రి సెలెక్షన్ ఉందన్న విషయం మైండ్‌లో ఎక్కడో కదులుతూనే ఉంది. చివరికి సెలెక్ట్‌డ్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడంతో చాలా బాధపడ్డా. లిస్ట్‌లో నేనెందుకు లేను అని ఆలోచించా. కానీ ఎంపికైన జట్టును చూస్తే . ఐపీఎల్‌తోపాటు ఇండియా తరఫున కూడా చాలా నిలకడగా పెర్ఫామ్ చేస్తున్న వాళ్లు అందులో చాలా మంది ఉన్నారు. దాంతో నా సెలెక్షన్ గురించి ఆలోచించడం మానేశా. మరిన్ని రన్స్ చేయడంతోపాటు నా చేతిలో, నా కంట్రోల్లో ఉన్న విషయాలపై దృష్టిపెడితే మంచిదని డిసైడయ్యా. అవకాశం ఎప్పుడు వచ్చినా సరే దానిని అందిపుచ్చుకోవాలని అర్ధం చేసుకున్నా’ అని సూర్య చెప్పుకొచ్చాడు.
వెరైటీ షాట్స్‌తో సూపర్బ్ ప్లే..
ఐపీఎల్ 13లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించడం వెనుక బ్యాట్స్‌మన్‌గా సూర్యది కీ రోల్. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సూర్య ఈ సీజన్లో గ్రౌండ్ నలుమూలలా షాట్ల కొట్టాడు. వెరైటీ షాట్స్‌తో బౌండ్రీలు రాబట్టి అలరించాడు. తన బ్యాటింగ్‌లో ఈ మార్పు కోసం సూర్య చాలా కష్టపడ్డాడట. ‘ఈ సీజన్లో మాత్రమే కాదు. 2018 సీజన్ అప్పుడు నుంచి గ్రౌండ్ నలుమూలలా షాట్స్ కొట్టడంపై దృష్టి పెట్టా. తొలుత నేను ఎక్కువుగా లెగ్ సైడ్ ఆడేవాడ్ని. కానీ ఇంత కాంపీటిషన్‌లో అవకాశం దొరకాలన్నా.. పరుగులు చేయాలన్న అన్ని వైపులా షాట్స్ కొట్టాలని అర్ధం చేసుకున్నా. అంతేకాక రంజీ ట్రోఫీలో నెగ్గుకురావాలన్నా ఏదో ఒక్క సైడ్ ఆడితే సరిపోదని తెలుసుకున్నా. దాంతో ఆఫ్ సైడ్ ఆడడంపై ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేశా. నెమ్మదిగా కొన్ని షాట్స్‌పై పట్టు సాధించా. క్రమంగా గ్రౌండ్‌కు అన్ని వైపులా ఆడటం అలవాటు చేసుకున్నా. ప్రస్తుతం నా బ్యాటింగ్ విషయంలో సంతృప్తిగా ఉన్నా. ఓవరాల్‌గా ఐపీఎల్ 13 విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. నిజానికి లీగ్‌కు ముందే కొన్ని గోల్స్ పెట్టుకున్నా. కానీ టోర్నీ మొదలయ్యాక నా కోసం ఆలోచించడం కంటే టీమ్‌కు ఏం కావాలో అది చేస్తే మంచిదని గ్రహించా. దాని వల్లే కొన్ని చిన్న ఇన్నింగ్స్‌లు కూడా చాలా ఎఫెక్ట్ చూపించాయి’ అని సూర్యకుమార్ వెల్లడించాడు.