అట్ల నడవదు బ్రదర్​.. అని పాఠం చెప్పింది

  • సుష్మా స్వరాజ్​తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మోడీ
  • ఢిల్లీలో సంస్మరణ సభ..
  • అన్ని పార్టీల నేతలూ హాజరు

న్యూఢిల్లీ: ప్రొటోకాల్​ రూల్స్​ని స్ట్రిక్ట్​గా ఫాలో అయ్యే విదేశాంగ శాఖను.. ప్రజలకు మరింత దగ్గర చేసి, ఎప్పుడు పిలిచినా పలికే ‘పీపుల్స్​ కాల్’ శాఖగా మార్చేసిన ఘనత సుష్మాస్వరాజ్​కే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇటీవల గుండెపోటుతో చనిపోయిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ సంస్మరణ సభ మంగళవారం ఢిల్లీలోని జవహరల్​లాల్​ నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఆ కార్యక్రమంలో పీఎం మోడీ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన ప్రతి ప్రనిని సుష్మాజీ చిత్తశుద్ధితో నెరవేర్చేవారని, కొత్తతరం లీడర్లకు ఆమెను మించిన స్ఫూర్తిప్రదాత ఉండరని అన్నారు. పురాణాల్లో చెప్పే ‘వసుధైక కుటుంబం’ భావనను సుష్మాజీ ఆచరణలోకి తీసుకొచ్చారని, ప్రపంచం నలుమూలల్లోని ఇండియన్లకు అండగా నిలబడ్డారని తెలిపారు. ‘‘గడిచిన 70 ఏండ్లలో దేశవ్యాప్తంగా 77 పాస్​పోర్ట్​ ఆఫీసులు ఉండేవి. సుష్మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఐదేండ్లలో పాస్​పోర్ట్​ ఆఫీసుల సంఖ్య 505కు పెరిగింది. ఆమె డైనమిజానికి ఇదొక చిన్న ఉదాహరణ” అని గుర్తుచేశారు.

‘‘పీఎం అయిన నెలరోజులకే యూఎన్​ జనరల్​ అసెంబ్లీలో ప్రసంగించాల్సి వచ్చింది. అంతకు ముందురోజే సుష్మాజీ నా దగ్గరకొచ్చి ప్రసంగం కాపీ చూపించమని అడిగారు. రాసిన ప్రసంగాన్ని చదవలేనని, తెల్సిన విషయాల్నే మాట్లాడుతానని తనతో చెప్పా. అందుకామె గట్టిగా నవ్వుతూ.. ‘అట్ల నడవదు బ్రదర్​.. మీరు ఇండియా వాయిస్​ను ప్రపంచానికి​ వినిపించాలి. నచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు”అని కరాకండిగా చెప్పారు. నిజమే, మనం ఎంత మంచి వక్తలమైనా ఆయా వేదికల రూల్స్​ని తప్పనిసరిగా పాటించాల్సిందే. సుష్మాజీ నాకు నేర్పిన తొలి పాఠమిది”అని మోడీ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లు, కాంగ్రెస్​, టీఎంసీ, బీజేడీ లీడర్లు సుష్మకు నివాళులు అర్పించారు.

కేంద్ర కేబినెట్​ నివాళులు

దివంగత సుష్మా స్వరాజ్‌‌కు కేంద్ర కేబినెట్‌‌ మంగళవారం నివాళి అర్పించింది. దేశానికి  ఆమె చేసిన సేవలను మంత్రులు మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండేవారని, గొప్ప మానవతావాది అని గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం పార్టీకి, దేశానికి తీరని లోటన్నారు. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఇండియన్స్‌‌కు సాయం చేయడం ద్వారా ఆమె అందరి హృదయాలను గెలుచుకున్నారని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. ‘ఇండియన్స్‌‌ బెస్ట్‌‌ లవ్డ్‌‌ పొలిటీషియన్‌‌’ అని యూఎస్‌‌కు చెందిన వాల్‌‌ స్ట్రీట్‌‌ జర్నల్‌‌’ 2017లో కొనియాడిందని గుర్తుచేసుకున్నారు. దేశం ఒక మంచి లీడర్‌‌ను, ఉత్తమ పార్లమెంటేరియన్‌‌ను కోల్పోయిందన్నారు.

Latest Updates