నేపాల్ భూకంపంలో ఆర్మీ రెస్క్యూ: సుష్మాకు స్పెయిన్ పౌర పురస్కారం

మాడ్రిడ్: భారత ఆర్మీ చూపిన తెగువకు అరుదైన గౌరవం దక్కింది. 2015 ఏప్రిల్ లో నేపాల్ లో సంభవించిన భూకంపంలో బాధితులను కాపాడిన తీరును స్పెయిన్ కీర్తించింది. నాటి ప్రళయంలో 71 మంది స్పెయిన్ పౌరులను కాపాడినందుకు కృతజ్ఞతగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ప్రతిష్టాత్మక పౌర పురస్కారం అందించింది. స్పెయిన్ పర్యటనకు వెళ్లిన ఆమెకు ఇవాళ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్’ పురస్కారాన్ని అందజేసింది. భారత ప్రజల తరఫున ఈ గౌరవాన్ని సుష్మా అందుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.

ఆపరేషన్ మైత్రి

2015 ఏప్రిల్ 26.. హిమాలయ దేశం నేపాల్ చరిత్రలో ఆ రోజు తీరని విషాదాన్ని నింపింది. కనీవినీ ఎరుగని రీతిలో భయంకరమైన భూకంపం ప్రళయం సృష్టించింది. దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 22 వేల మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంతటి ఘోర విషాద సమయంలో నేపాల్ కు భారత్ అండగా నిలిచింది. భూకంపం సంభవించిందని తెలియగానే ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో రెస్క్యూ స్టార్ట్ చేసింది. భూకంపం వచ్చిన తర్వాత 15 నిమిషాల్లోనే ఆర్మీని రంగంలోకి దింపింది. ప్రకృతి విళయంలో చిక్కుకున్న వేల మందిని మన జవాన్లు కాపాడారు. సైనికులకు అక్కడ సాయం చేసేందుకు నేపాల్ కు చెందిన గోర్ఖా రెజిమెంట్ మాజీ జవాన్లు కూడా ఆపరేషన్లో పాల్గొన్నారు.

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేయడానికి వచ్చిన వందల మంది విదేశీ పర్యాటకులను జవాన్ల కాపాడారు. ఇలా సేవ్ చేసిన వారిలో 71 మంది స్పెయిన్ పౌరులున్నారు. దీనికి కృతజ్ఞతగా నేడు స్పెయిన్ పౌర పురస్కారంతో భారత విదేశాంగ మంత్రిని గౌరవించింది.

Latest Updates