థాంక్స్ పీఎం.. కశ్మీర్‌పై సుష్మా లాస్ట్ ట్వీట్ వైరల్

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ లో చేసిన చివరి పోస్ట్ ఒక్కరోజులోనే వైరల్ గా మారిపోయింది. ఆమె మంగళవారం సాయంత్రం 7గంటల 23 నిమిషాలకు ట్వీట్ చేశారు. కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 బిల్లు లోక్ సభలో పాస్ కావడం, పార్లమెంట్ ఆమోదం పొందడంపై ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. “ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారూ..మీకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజుకోసమే నేను నా జీవితకాలమంతా ఎదురుచూశాను ” అని ట్వీట్ చేశారు సుష్మాస్వరాజ్.

విదేశాంగ మంత్రిగా భారత్ – పాకిస్థాన్ మధ్య సరిహద్దు సమస్య పూర్తిస్థాయిలో తెలిసిన నాయకురాలు ఆమె. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. బీజేపీ వ్యూహం తెలిసిన ఆమె..  ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రశంసించారు. రాజ్యసభలో జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 బిల్లును  అమిత్ షా ప్రవేశపెట్టడాన్ని, ఆ తర్వాత ఆయన ఇచ్చిన ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దూకుడైన, చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారనీ.. గ్రేట్ ఇండియాకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారామె.

కశ్మీర్ పునర్విభజనపై చేసిన ట్వీట్.. తన చివరి ట్వీట్ అని అప్పటికి ఆమెకు తెలియదు. కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. ఆమె తుదిశ్వాస విడిచారని డాక్టర్లు చెప్పారు.

సుష్మాస్వరాజ్ చేసిన ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది. 24 గంటల్లోనే మూడున్నర లక్షల మంది వరకు లైక్ చేశారు. 73వేల మంది రీట్వీట్ చేశారు. 34 వేల మంది కామెంట్ చేశారు. 2010 నవంబర్ లో సుష్మ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను 13.2 మిలియన్లు అంటే 1కోటి 32లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె మొత్తంగా 6వేల 371 ట్వీట్లు చేశారు. విదేశాల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని స్వదేశానికి రప్పించిన ఘనత ఆమె సొంతం. ఆపదలో ఉన్నామంటే మార్స్ లో ఉన్నా ఇండియన్ ఎంబసీ ఆదుకుంటుందని భరోసా, ధైర్యం ఇచ్చారు సుష్మస్వరాజ్. గత ఎన్నికల్లో ఆమె అనారోగ్యం కారణంగా పోటీ చేయలేదు. ఇకనుంచి ఆమె ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టులు రావని తెలిసి.. అభిమానులు బాధపడుతున్నారు.

Latest Updates