పార్టీ ఆదేశిస్తే అగ్గిలో దూకేందుకు సిద్ధం: స్వామిగౌడ్

పార్టీ ఆదేశిస్తే అగ్గిలో దూకేందుకు సిద్ధం అన్నారు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్. మీడియా చిట్‌ చాట్‌లో మాట్లాడిన ఆయన… పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమేనన్నారు. తన పోరాట క్రమమే తనను చప్రాసి నుంచి చైర్మన్ ను చేసిందన్నారు. తనకు 6ఏళ్ల మండలి ఛైర్మన్ పదవి మంచి సంతృప్తినిచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకున్నాఅని అనుకుంటున్నానన్నారు. నాటి నుంచి నేటి వరకు అర్థవంతమైన, ప్రశాంత వాతావరణంలో సభ జరిగిందన్నారు స్వామిగౌడ్‌. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రసంగించారన్నారు. ఒకరిని మించి ఒకరు మంచిగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా నన్ను సభ ఇలానే జరపాలని నిర్దేశించలేదని.. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యులు సహకరించారన్నారు. ప్రశ్న సప్పగా ఉంటే మంత్రి సమాధానం కూడా సప్పగా ఉంటుందన్న ఆయన.. ప్రశ్నలు గట్టిగా ఉంటే ప్రభుత్వం గట్టిగా ఉంటుందన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలకు కొంత అవకాశం ఇచ్చిన మాట వాస్తవమన్నారు.

ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయన్న స్వామిగౌడ్‌.. తాను చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. కౌన్సిల్ అంటే ఒక కుటుంబం… ఎప్పుడూ నేను భాదపడలేదు. సంతృప్తి, మనస్ఫూర్తిగా ఉందన్నారు. డి.శ్రీనివాస్ నా తండ్రి లాంటి వారని..వాళ్ళింటికి వెళితే పాదాభివందనం చేసే వాడినని తెలిపారు. సభలో ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకోవాల్సి వచ్చిందని..అయితే ఇది సభను నడిపించడంలో భాగమేనన్నారు. రూల్స్ బుక్ ను ఫాలో కావాల్సిందే తప్ప..తాను సొంతంగా చేసేది లేదన్నారు. ఎవరైనా భాదపడితే క్షమించాలని కోరారు స్వామిగౌడ్‌.

ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి ప్రజలతో ఓటు వేయించుకోవాలనే కసి ఉందన్న స్వామిగౌడ్‌… అది ఏ ఎన్నికలైనా సరే.. లోక్ సభ అయినా.. ఇంకా ఏదైనా సరే అన్నారు.  తనకు సొంత ప్రణాళిక ఏమీలేదన్నారు. ఇక నా కొడుకుకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్న ఆయన.. సేవాభావంతో పనులు చేస్తున్నాడన్నారు. తనది చేవెళ్ల నియోజకవర్గం అయినా,  నా ఎమ్మెల్సీ నిధులు కరీంనగర్ కే ఖర్చు పెట్టాను తప్ప… నా ఇంటి ముందు కనీసం లైట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా వినియోగించలేదన్నారు. చివరగా గోపన్ పల్లి భూముల విషయంలో ఏ తప్పు చేయలేదని… కోర్టులు ఏ నిర్ణయం తీసుకున్న అందుకు సిద్ధమేనన్నారు స్వామిగౌడ్‌.

Latest Updates