రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ సైరన్

  •                 గత ఏడాది మొత్తం1,007 కేసులు నమోదు
  •                 ఈ నెలలో ఇప్పటికే 14 కేసులు 
  •                 రాష్ర్టంలో ఒకరు.. దేశవ్యాప్తంగా 30 మంది మృతి

రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. చలి వాతావరణం పెరిగింది. ఇప్పటికే జ్వరం వచ్చినోళ్లతో హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. దానికి తోడు స్వైన్​ఫ్లూ వచ్చే అవకాశాలూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వైన్​ఫ్లూ అప్రమత్తతపై చర్చించారు. కేసుల గుర్తింపు, ట్రీట్​మెంట్​కు సంబంధించి ఆస్పత్రులకు గైడ్​లైన్స్​ ఇచ్చారు. ప్రస్తుతం వైరల్​ ఫీవర్​ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్న నేపథ్యంలో, స్వైన్​ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వైరస్​ వ్యాపించే ప్రమాదముందని, స్వైన్​ ఫ్లూ అనుమానిత కేసుల్లో బాధితులను వేరుగా ఉంచి ట్రీట్​మెంట్​ చేయాలని సూచించారు. బాధితులను జిల్లా ఆస్పత్రులకు పంపించాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసోలేటెడ్​ వార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్వైన్​ ఫ్లూ అనుమానిత వ్యక్తుల నుంచి శాంపిళ్ల సేకరణ బాధ్యత జిల్లా దవాఖాన్లదేనని, 24 గంటల్లో ఐపీఎంకు పంపించాలన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో తీసుకున్న శాంపిళ్లను ఫీవర్​ హాస్పిటల్లోని స్వైన్​ ఫ్లూ నిర్ధారణ కేంద్రానికి పంపించాలన్నారు.  ఈ నెలలో ఇప్పటికే 14  కేసులు నమోదవగా, ఒకరు చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తంగా 1,007 కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1300 కేసులు నమోదయ్యాయి.  దేశవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది మొత్తం 15,266 కేసులు నమోదు కాగా,  1,128 మంది చనిపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 27,767 కేసులు నమోదయ్యాయి. 1,167 మంది మరణించారు. 30 మంది సెప్టెంబర్​లో చనిపోయారు. హైదరాబాద్​లోని ఐపీఎం, ఫీవర్​ హాస్పిటళ్లలోని స్వైన్​ఫ్లూ నిర్ధారణ కేంద్రాలకు రోజూ సుమారు వంద శాంపిళ్లు వస్తున్నాయి. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే స్వైన్​ ఫ్లూ పాజిటివ్​గా నిర్ధారణ అవుతున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏటా సాధారణంగా చలికాలం ప్రారంభమయ్యే అక్టోబర్​ నుంచి స్వైన్​ ఫ్లూ కేసులు నమోదవుతుంటాయి. కానీ, ఈసారి ఆగస్టు నుంచే వైరస్​ ఉనికి పెరగడం ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. స్వైన్​ఫ్లూకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే 104 లేదా 040–24651119 నంబర్లకు ఫోన్​ చేసి తెలుసుకోవచ్చని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీళ్లు జాగ్రత్తగా ఉండాలె

గర్భిణులు, ఐదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే వాళ్లు.

లక్షణాలు

జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటినొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం.

చేయవలసినవి

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి కర్చీఫ్​ను అడ్డుపెట్టుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండాలి. జనం ఎక్కువున్న చోట మాస్క్​లు కట్టుకోవాలి.

చేయకూడనివి

ఇతరులకు షేక్​ హ్యాండ్​ ఇవ్వకూడదు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మొద్దు.

Latest Updates