నడీడోళ్లనూ వదుల్తలేదు

హైదరాబాద్‌‌, వెలుగు: పసి పిల్లల నుంచి పండు ముసలి వరకూ స్వైన్‌‌ ఫ్లూ ఎవరినీ వదలడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ర్టంలో 1,339 స్వైన్‌‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా నడీడోళ్ల కేసులే ఉన్నాయి. మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల్లో 40.5% కేసులు 36–59 ఏండ్ల వయసు వాళ్లవి ఉన్నాయి. 15.38 శాతం కేసులు 21 నుంచి 35 ఏండ్ల లోపు వాళ్లవి. 13.06 శాతం ఐదేండ్లలోపు పిల్లలవే ఉన్నాయి. మరో 5.3% కేసులు 6 నుంచి 20 ఏండ్లలోపు వాళ్లవి ఉన్నాయి. సాధారణంగా పిల్లలకు, వృద్ధులకు ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల, వారికి వైరస్ త్వరగా సోకే ప్రమాదముంటుంది. వీళ్లనే రిస్కీ గ్రూప్‌‌గా పేర్కొంటారు. కానీ, ఈసారి నమోదవుతున్న కేసుల్లో యువకులు, నడి వయస్కులవే ఎక్కువగా ఉన్నాయి.

పిల్లలు జాగ్రత్త

ఫ్లూ వైరస్ అన్ని వయసుల వారికీ సోకుతున్నా.. మోర్టాలిటీ రేటు పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. తల్లికి లేదా ఇంట్లో ఎవరికైనా స్వైన్‌‌ ఫ్లూ వస్తే పిల్లలకూ త్వరగా సోకే ప్రమాదముంటుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ ఇలాంటివేనని అధికారులు చెబుతున్నారు. ఫ్లూ సోకిన వాళ్లు దగ్గినా, తుమ్మినా కొన్ని గంటల పాటు వైరస్‌‌ గాలిలో అలాగే ఉంటుంది. నేల, ఫ్లోర్‌‌‌‌పై కూడా ఈ వైరస్ ఎక్కువసేపు బతక గలదు. వైరస్‌‌ ఉన్న గాలిని పీల్చినా, పిల్లలు ఆడుకునేటప్పుడు ఫ్లోర్‌‌‌‌పై ఉన్న వైరస్‌‌ను తాకినా వెంటనే సోకుతుంది. రెండేండ్ల లోపు పిల్లలకు, అప్పటికే ఏదైనా జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు ఫ్లూ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ. చాలా అప్రమత్తంగా ఉండాలని, ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేయించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఫ్లూ వచ్చిన కుటుంబంలో పిల్లలకు, పెద్దలకు ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్, అవసరమైన మెడిసిన్ అందిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.800 నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

22 మంది మృతి

ఈసారి చలి తీవ్రత పెరగకముందే హెచ్‌‌1ఎన్‌‌1 వైరస్ విస్తరించింది. గతేడాది కంటే ఇప్పటికే 330 కేసులు ఎక్కువగా నమోదు కాగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు ఫ్లూ కేసులను ఎట్ల ట్రీట్ చేయాలన్న దానిపై దవాఖాన్లకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దలతోపాటు, పిల్లలనూ ఐసోలేషన్ వార్డుల్లో వేరుగా ఉంచి ట్రీట్ చేయాలని సూచించారు. సీరియస్ కేసులను గాంధీ లేదా ఉస్మానియాకు తరలించాలని ఆదేశించారు. జిల్లాకు ఒకటి చొప్పున 33 దవాఖాన్లలో ఇప్పటికే స్వైన్ ఫ్లూ ఐసోలేషన్ వార్డులు ప్రారంభించారు.

ప్రైవేట్​ హాస్పిటళ్లలో తప్పుడు టెస్టులు!

అనుమానిత కేసుల శాంపిళ్లను హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎంకు పంపించాలని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు శాంపిళ్లను పంపించకుండా, ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ చేసి స్వైన్‌‌ఫ్లూ నిర్ధారిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

Latest Updates