ఫుట్ బాల్ స్టేడియంలో అడవి

ఫుట్​బాల్​ స్టేడియమంటే ఎట్లుంటది? ఆటగాళ్లు ఉరుకలెత్తుతూ బంతిని తన్ని గోల్​లో పడేస్తే అభిమానుల అరుపులు, కేరింతలతో దద్దరిల్లుతది! మరి, అట్లాంటి స్టేడియం ప్రశాంతంగా ఉంటే ఎట్లుంటది? చల్లటి గాలులు మొహాన్ని తాకి, దాని చిన్నని సౌండ్లు చెవులకు చేరితే ఎట్లుంటది మస్తుంటది కదా! అట్లాంటి అనుభూతి కలగాలంటే ఆస్ట్రియాలోని క్లేగన్​ఫర్ట్​కు వెళ్లాల్సిందే. మరి, అక్కడే కదా ఈ స్టేడియం అడవి ఉన్నది. వర్థెర్సీ అనే ఫుట్​బాల్​ స్టేడియం అడవిగా మారిపోయింది. స్విట్జర్లాండ్​కు చెందిన క్లౌస్​ లిట్​మన్​ అనే ఓ పెద్ద ఆర్టిస్టు ఆ అడవికి ప్లాన్​ గీసిచ్చాడు. ఆ స్టేడియంలో దాదాపు 300 చెట్లను పెంచారు. ఒక్కో చెట్టు బరువు 6 టన్నులకుపైమాటే. 30 ఏళ్ల కిందట ఆస్ట్రియా ఆర్టిస్ట్​ మ్యాక్స్​ పెయింట్నర్​ గీసిన ‘ఫర్​ ఫారెస్ట్​: ద అన్​ఎండింగ్​ అట్రాక్షన్​ ఆఫ్​ నేచర్​’ పెయింటింగ్​నే స్ఫూర్తిగా తీసుకుని స్టేడియంలో ఇలా అడవిని పెంచారన్నమాట. దానిని సెప్టెంబర్​ 8న ప్రారంభించారు. ఆల్డర్​, యాస్పెన్​, వైట్​ విల్లో, హార్న్​బీమ్​, మేపుల్​, ఓక్​ వంటి చెట్లతో అడవిని సృష్టించారు. ప్రస్తుతం అభివృద్ధి పేరిట అడవులను నరికేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి మనుషుల పనుల్ని సవాల్​ చేస్తూ, ప్రకృతిని కాపాడుకోవాలన్న సంకేతం ఇస్తూ స్టేడియంలో అడవిని పెంచేశారట. అయితే, అది ఎక్కువ కాలం జనానికి కనిపించదు. అక్టోబర్​ 27 వరకు మాత్రమే అందులోకి జనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత నో ఎంట్రీ. ఎందుకంటే, అప్పటికి అడవి ఉండదుగా మరి. అంటే, కొట్టేస్తారా.. అని అడగొద్దు. అడవిని ఆ స్టేడియం సమీపంలోనే మళ్లీ నాటేస్తారు. అక్కడ పెంచుతారు. మరి, ఆస్ట్రియాలో అదే ప్రధాన ఫుట్​బాల్​ స్టేడియం కదా. క్లేగన్​ఫర్ట్​ టీంకు అదే ఆధారం. ప్రాక్టీస్​లు, నేషనల్​ లెవెల్​ మ్యాచ్​లు అందులో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టే ఈ తరలింపు.

 

Latest Updates