సీజనల్ వ్యాధుల లక్షణాలు.. కరోనా లక్షణాలు ఒకేలా ఉన్నాయి: మంత్రి ఈటెల

అందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలి -మంత్రి ఈటెల

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జలుబు జ్వరాల తో బాధ పడే వారి సంఖ్య పెరిగింది. వీటి లక్షణాలు కరోనా లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అందుకే లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు మంత్రి ఈటెల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  గ్రామాల నుండి పట్టణాల వరకు అన్ని చోట్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.. పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల వారితో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వచ్చిన వారు ఇతరులకు వాటిని అంటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలియజేశారు.

గ్రేటర్ పరిధిలో వర్షాలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 585 మెడికల్ క్యాంపులు నిర్వహించామని, 104 వాహనాల ద్వారా 50 మొబైల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. ఈ క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 38516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు. 30,367 మందికి మాస్కులు, 2795 మందికి శానిటైజర్లు  అందించామని తెలిపారు.  రిలీఫ్ క్యాంపులలో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు.. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు లక్షణాలు ఉన్న 3406 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో 90 మందికి పాజిటివ్ అని నిర్ధారణ జరిగిందని తెలిపారు. వీరందరినీ నిర్దేశిత ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ లో ఏ ప్రమాదం జరిగినా చికిత్స అందించే వైద్య సదుపాయాలతోపాటు.. హైదరాబాదులో ఉన్న ప్రతి హాస్పిటల్లో 24 గంటలు నిరంతరం డాక్టర్ల ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఏ ప్రమాదం జరిగినా  వెంటనే చికిత్స అందించే విధంగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని డాక్టర్ రమేష్ రెడ్డి వివరించారు. సీజనల్ వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందుగానే వారిని వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య కార్యకర్తలు ఆశావర్కర్లు గ్రామగ్రామాన మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలుషిత నీటి ద్వారా ఎక్కువ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ టాబ్లెట్లు ఇంటింటికి అందిస్తున్నామని వివరించారు.

ఈ సమయంలో ప్రజలు కూడా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని సూచించారు. జ్వరం జలుబు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్లి వారి సలహాలతో అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నందువల్ల ప్రజలు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.

Latest Updates