హైదరాబాద్, వెలుగు: బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ వేదికగా జరుగుతున్న టీ9 చాలెంజ్ గోల్ఫ్ సీజన్‌లో రెండు రౌండ్లు ముగిసేసరికి బంకర్ బస్టర్, పార్ టైమర్స్ టాప్‌లోకి దూసుకొచ్చాయి. పూల్–ఎలో ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత చెరో 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే 5–2తో మెరుగైన విన్‌లాస్ రికార్డు వల్ల బంకర్ బస్టర్స్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.
దాసోస్ బై మాహి జట్టు 4.5 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. విసాఫ్ట్ టైటాన్స్ (3.5), శ్రీ మెట్రిక్స్ ఈగల్స్ (3), రాజపుష్ప ఇన్విక్టా (2) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పూల్–బిలో రెండో రోజు ఆటలో 3 పాయింట్లు గెలిచిన ఆర్డీ ఐరన్ ఈగల్స్ 5 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. జాగృతి జాగ్వార్స్ కూడా ఐదు పాయింట్లతో ఉంది.
చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్ (4.5), హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్ (3.5), ఫెయిర్‌వే వారియర్స్ (3), నోవాటెల్ స్టార్స్ (3) రేసులో కొనసాగుతున్నాయి. ఫోర్-బాల్ బెటర్ బాల్ + సింగిల్స్ ఫార్మాట్‌లో తొమ్మిది హోల్స్ చొప్పున ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 12 జట్లు రెండు పూల్స్‌గా విడిపోయి పోటీపడుతుండగా, ప్రతి పూల్ నుంచి టాప్–4లో నిలిచే జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.
