హీరో భార్య నన్ను కావాలనే తప్పించింది

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. తుదపరి సినిమా గురించి  ఇంటర్వ్యూలు ఇస్తూ ఫ్యాన్స్‌‌ను ఖుషీ చేస్తుంటుంది. మూవీ విషయాలతోపాటు ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా తాప్సీ పలుమార్లు పెదవి విప్పింది. ఒక సినిమా నుంచి తనను తీసేసి ఓ స్టార్ కిడ్‌‌ను సెలెక్ట్ చేశారని తాప్సీ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి మరో అనుభవం గురించి తాప్సీ మాట్లాడింది. ఒక హీరో భార్య కావాలనే తనను ఓ సినిమా నుంచి తప్పించిందని తెలిపింది.

‘నా కెరీర్ మొదట్లో వింతైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. నేను మరీ అందంగా లేననే కామెంట్లను ఫేజ్ చేశా. ఒక హీరో సినిమాలో నుంచి సదరు కథానాయకుడి భార్య నన్ను కావాలనే తొలగించింది. ఆ మూవీలో నేను భాగం కాకూడదని ఆమె భావించింది. మరో ఫిల్మ్‌‌లో నేను చెప్పిన డైలాగులు హీరోకు నచ్చలేదు. దాంతో డైలాగులు మార్చమని చెప్పారు. దానికి నేను ఒప్పుకోకపోవడంతో నాకు తెలియకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌తో నా పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. కొందరు హీరోలు తమకు ఫ్లాప్‌‌లు వచ్చినప్పుడు బడ్జెట్‌‌ను కంట్రోల్ చేసేందుకు నా పారితోషికాలను తగ్గించారు. ఇంకో సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ హీరో పరిచయ సన్నివేశం కంటే బలంగా ఉందని మార్చేశారు. ఇవన్నీ నా ముందు జరిగాయి. ఇక నా వెనుక జరిగే వాటి గురించి నాకు తెలియదు. అందుకే ఇప్పటినుంచి నా ఆత్మగౌరవానికి హాని కలిగించని చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా’ అని తాప్సీ పేర్కొంది.

Latest Updates