చెంప దెబ్బకే విడాకులా?

ఒకే ఒక చెంపదెబ్బ…. కోపంగా ఉన్నప్పుడో, అసహనం పెరిగినప్పుడో భార్య మీద భర్త చెయ్యి చేసుకోవటం కామన్… ఇప్పటి వరకూ ఇదే ఆలోచన చాలామందిలో ఉండొచ్చు. కానీ…! ఇప్పుడొక సినిమా ట్రైలర్ దేశవ్యాప్త చర్చల్లోకి వచ్చింది. గృహహింస అనేది కేవలం వొంటిమీద పడే దెబ్బలని బట్టి నిర్ణయించలేం. ఒక మనిషిని కొట్టటం అంటే కేవలం శరీరం మీద కాదు అప్పటివరకూ ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టినట్టే. భర్త ఒక చెంపదెబ్బ కొట్టాడని విడాకులు తీసుకోవటం అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది, ఆమెకి పిచ్చెక్కిందా అనిపిస్తుంది. అయినా సరే ఆమె విడాకులకి సిద్ధపడింది. టూకీగా ఇదీ ఆ సినిమా కథ. సినిమా పేరు థప్పడ్… 

ప్రేమలో రెస్పెక్ట్ ఉండాలి, ప్రేమించటం అంటే పార్ట్‌‌నర్ సంతోషాన్ని కోరుకోవటం అన్నప్పుడు ఎలా కొట్టగలుగుతారు అన్న బేసిక్ క్వశ్చన్ ఎప్పుడో మొదలైంది. కానీ చాలా విషయాలు మనకు అసలు హింస కిందకి వస్తాయని కూడా చాలా మందికి తెలియదు. అన్నంలో వచ్చే చిన్నరాయి, కాఫీలో తగ్గిన చక్కెర కూడా ఈజీగా ఆమెని తిట్టటానికి, కొట్టటానికి కారణాలు అయిపోతున్నా అది హింసగా అనిపించదు. “ఆడపిల్లలు సర్దుకుపోవాలి” అనే ఒక్క మాటతో చేతులు కట్టేశాం. కేవలం చెంపదెబ్బ కాదు అది వ్యక్తిత్వం మీద పడే దెబ్బ. ఈ ట్రైలర్ తో ఇప్పటివరకూ ఉన్న సైలెన్స్ బ్రేక్ అయ్యింది స్త్రీ హక్కులు అనగానే బస్ లో సీట్ల కోసమనీ, సమాన హక్కులు అనగానే వేసుకున్న బట్టలమీదా, వ్యక్తిగత అలవాట్ల మీదా జోకులు పేల్చి నవ్వటం మామూలు విషయం అనిపించినంత కాలం. ఒక చెంపదెబ్బ పెట్టే బాధ అర్థం కాదు. స్త్రీ అంటే ఇంటి గౌరవం అని చెబుతూనే ఆమెకి ఇంట్లో మాత్రం గౌరవం ఇవ్వలేకపోవటం ఉన్నంత కాలం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అనే మాట అర్థం కాదు. ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపించే విషయాలే కానీ భరించటానికి చాలా కష్టమైనవి. ఎంతో ప్రేమించిన భర్త, చక్కటి సంసారం అనిపించుకున్నా ఎక్కడో రెండు నిమిషాల కాలం చాలు. ఒక్క మాట చాలు ఆ ఆనందమంతా అసహ్యంగా మారిపోవటానికి. ఇక్కడ కారణం ఒక్క దెబ్బ కాదు, రిలేషన్ లో ఉన్న బాండ్ మీద ప్రభావం చూపించే అంశం.

అదే విషయాన్ని థప్పడ్ లో బలంగా చూపించే ప్రయత్నం చేశారు. “ఆ ఒక్క చెంపదెబ్బ మామూలే అని అనుకున్న చాలా విషయాలని స్పష్టంగా చూసేలా చేసింది” అనే ఒక్క మాటతో సినిమా ఏ పాయింట్ మీద రాసుకున్నారో చెప్పేసింది. ఇదివరకు తాప్సీ హీరోయిన్ గానే వచ్చిన “పింక్”  బేసిక్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అనే పాయింట్‌‌ని ఇలాగే చర్చల్లోకి తెచ్చింది. “ఆమె మీ భార్య అయినా, సెక్స్ వర్కర్ అయినా ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం” అంటూ అమితాబ్ చెప్పిన డైలాగ్ తో సహా చాలా డైలాగ్స్ సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేశాయి. నిజానికి స్త్రీ సమానత్వం అంటే జాబ్ చెయ్యటం మాత్రమే కాదు, ఆ డబ్బుని ఖర్చు చేసే అవకాశం తనకు మాత్రమే ఉండటం. స్త్రీ స్వేచ్చ అంటే బైక్ వేసుకొని వెళ్ళటం మాత్రమే కాదు నచ్చిన బట్టలు వేసుకోగలగటం… ఇవన్నీ జరిగినా ఆమె మీద ఎలాంటి చూపూ పడక పోవటం. ఆడవాళ్ళ స్వేచ్చ అంటే మగవాళ్ళు “ఇచ్చేదికాదు” అని అర్థమవ్వాలంటే ముందుగా మనిషిగా గుర్తించాలి.

Latest Updates