ఆర్మీ కంటోన్మెంట్ లో దాక్కున్న ఢిల్లీ జ‌మాత్ స‌భ్యులు.. అంద‌రికీ క‌రోనా పాజిటివ్

దేశంలో మూడు నాలుగు రోజులుగా ఒక్క‌సారిగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కేసుల‌న్నింటిలో ఎక్కువ భాగంగా ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్కజ్ లో గ‌త నెల జ‌రిగిన‌ త‌బ్లిగీ జ‌మాత్ స‌దస్సుకు హాజ‌రైన వారే ఉన్నారు. దీంతో ఆ స‌ద‌స్సుకు వెళ్లిన వారంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి టెస్టులు చేయించుకోవాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. అయితే కొన్ని చో్ట్ల ఇప్ప‌టికే కొద్ది మంది జ‌మాత్ స‌భ్యులు వైద్యుల‌కు స‌హ‌క‌రించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. త‌మ అడ్ర‌స్ ల‌లో కూడా లేకుండా దాక్కుంటున్నారు కొంత‌మంది. వారికి క‌రోనా వ‌చ్చి ఉంటే మ‌రింత మందికి వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉండ‌డంతో వారి ఆచూకీని గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు పోలీసులు.

ఆర్మీ అల‌ర్ట్.. జ‌వాన్లు అక్క‌డికి వెళ్లొద్దు..

యూపీలోని ల‌క్నో ఆర్మీ కంటోన్మెంట్ మ‌సీదులో కొంత మంది జ‌మాత్ దాక్కున్నారు. దీనిపై ప‌క్కా స‌మాచారంతో యూపీ పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. అక్క‌డ‌ 12 మంది జ‌మాత్ స‌భ్యులు దాగి ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మెడిక‌ల్ టీమ్స్ తో అక్క‌డికి చేరుకుని వారి నుంచి శుక్ర‌వారం శాంపిల్స్ సేక‌రించారు. టెస్టుల్లో అంద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో వారంద‌రినీ ల‌క్నో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జమాత్‌కు వెళ్లి వచ్చిన వీరు అధికారులకు సమాచారం ఇవ్వకుండా కంటోన్మెంట్ లో దాగి ఉండ‌డంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే వారికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేల‌డంతో ఆ ఏరియాలో హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించామ‌ని చెప్పారు ఆర్మీ సెంట్ర‌ల్ క‌మాండ్ పీఆర్వో. ఆ ప్రాంతంలోని స‌ర్దార్ బ‌జార్ కు జ‌వాన్లు ఎవ‌రూ వెళ్లొద్ద‌ని సూచించిన‌ట్లు తెలిపారు. మెడిక‌ల్ అవ‌స‌రాల‌కు త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు ఆదేశించార‌ని, నిత్యావ‌స‌రాల‌ను కూడా ఇంటికే తెచ్చిస్తున్నార‌ని ఓ స్థానికుడు చెప్పాడు.

Latest Updates