లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌,వీఆర్వో

షాద్నగర్, ఎల్బీ నగర్,వెలుగు:భూమిని ఆన్‌లైన్‌ చేసేందుకు ఎకరానికి లక్షల రూపాయల చొప్పున రైతును డిమాండ్ చేసిన తహసీల్దార్, వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నరు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన భాస్కర్‌కు సర్వే నంబర్ 85/ఆ లో 12 ఎకరాల భూమి ఉంది. ఉన్నట్టుండి కొద్దిరోజుల కింద తన జాగాలో 9 ఎకరాల 17 గుంటల భూమి ఆన్‌లైన్‌లో లేకుండా పోయింది. వీఆర్వో అనంతయ్యను కలిసి తన భూమి ఆన్‌లైన్‌లో లేకుండా పోయిందని తెలిపారు. రికార్డులు పరిశీలిస్తానని వీఆర్వో చెప్పారు. మూడునాలుగు రోజులైనా సరి చేయకపోవడంతో మళ్లీ వీఆర్వోను కలిశాడు.

ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రూ.9 లక్షలు కేశంపేట తహసీల్దార్ లావణ్య డిమాండ్ చేస్తున్నారని… ఆ డబ్బులు ఇస్తేనే భూమి పట్టాదారు పాస్‌ బుక్కులు ఇచ్చి ఆన్‌లైన్‌ చేస్తామని వీఆర్వో రైతుకు చెప్పాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. వారి సూచన మేరకు రెవెన్యూ అధికారులను లంచం మొత్తం తగ్గించాలని కోరాడు. చివరకు తహసీల్దార్ లావణ్యకు రూ.5 లక్షలు, వీఆర్వోకు రూ.3 లక్షలు చొప్పున మొత్తం రూ.8 లక్షలు.. రెండు విడతల్లో ఇస్తానని రైతు చెప్పడంతో ఒప్పుకున్నారు. మొదటి విడతగా నాలుగు లక్షల రూపాయలు కొందుర్గ్‌ మండల తహసీల్దార్‌ ఆఫీస్‌లో వీఆర్వో అనంతయ్య తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నరు.  మరోవైపు కేశంపేటలో తహసీల్దార్ లావణ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం ఏసీబీ ఆఫీసర్‌ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులను తప్పకుండా జైలుకు పంపిస్తామని తెలిపారు .