తహసీల్దార్‌ లావణ్యకు రెండురోజుల కస్టడీ

కేశంపేట తహసీల్దార్‌ లావణ్యకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కటకటాల పాలైన లావణ్యను రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ గురువారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం లావణ్య చంచల్‌ గూడ జైల్లో రిమాండ్‌ లో ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

హయత్‌ నగర్‌ లోని తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఇటీవల ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా.. లావణ్య వ్యవహారం బయటపడింది. లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు. దీంతో హయత్‌ నగర్‌ లోని ఆమె నివాసంలో సోదాలు జరపగా.. రూ.93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం దొరికింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేశారు పోలీసులు.

 

Latest Updates