తాజ్​ లేక్​ ప్యాలెస్..వరల్డ్ లోనే​ టాప్​ 3

నీళ్ల మీద పడిన గాలి మన మొహాలను తాకితే ఆ అనుభూతి మస్తుంటది. అలాంటి ప్రాంతాలకు టూర్​ వెళితే మనసు హాయిగా ఉంటది. అక్కడే హోటళ్లలో దిగితే మరింత ఆనందం సొంతమవుతుంది. అలాంటి హోటలే రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో ఉన్న తాజ్​ లేక్​ ప్యాలెస్​. అందుకే ప్రపంచంలోని బెస్ట్​ హోటళ్ల జాబితాలో మూడో స్థానాన్ని సాధించింది. దాంతో పాటు టాప్​ టెన్​లో రాంబాగ్​ ప్యాలెస్​ హోటల్​ కూడా చోటు సంపాదించింది. వీటికి రేటింగ్​లిచ్చింది కూడా పర్యాటకులే. కోండే నాస్ట్​ ట్రావెలర్​ అనే సంస్థ ఇటీవల రీడర్స్​ చాయిస్​ అవార్డ్స్​ను ప్రకటించింది. అందులో భాగంగా ప్రపంచంలోని 17 ఉత్తమ హోటళ్ల జాబితాను ప్రకటించింది. రాంబాగ్​ ప్యాలెస్​ 7వ ర్యాంకు సాధించగా, అలిలీ ఫోర్ట్​ బిషన్​గఢ్​ 11వ స్థానంలో నిలిచింది. ఈ సారి గ్లోబల్​ రీడర్స్​ చాయిస్​ జాబితాలో అమెరికా, బ్రిటన్​లనూ చేర్చింది కోండె నాస్ట్​ ట్రావెలర్​. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఓటింగ్‌‌లో పాల్గొన్నారు. వాళ్లకు ఇష్టమైన ప్రాంతాలు, హోటళ్లు, స్పాలు, ఎయిర్​లైన్స్​, క్రూయిజ్​ లైన్స్​ వంటి వాటికి రేటింగ్​ ఇచ్చారు. ఆ జాబితాలో భాగంగానే దేశంలోని తాజ్​ ప్యాలెస్​ హోటళ్లను అక్కున చేర్చుకున్నారు. ప్యాలెస్​లు అనగానే మనకు గుర్తొచ్చేది రాజులు, రాణులే కదా. వాళ్ల హుందాతనానికి తగ్గట్టు వాటిని కట్టుకున్నారు. ఇప్పుడు హోటళ్లుగా మారిన ఆ కోటలు పర్యాటకులకు మంచి అనుభూతిని మిగుల్చుతున్నాయి. అందుకే ఇతర తాజ్​ ప్యాలెస్​ హోటళ్లూ వివిధ కేటగిరీల్లో చోటు సంపాదించాయి. ఇండియా టాప్​ 15 హోటళ్ల జాబితాలో ఉమైద్​ భవన్​ ప్యాలెస్​ (జోధ్​పూర్​), జై మహల్​ ప్యాలెస్​ (జైపూర్​), తాజ్​ మహల్​ ప్యాలెస్​ (ముంబై) వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. జాబితాలో మంచి స్థానాలను దక్కించుకోవడంపై తాజ్​ గ్రూప్​ ఆపరేషన్స్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​ ప్రెసిడెంట్​ రోహిత్​ ఖోస్లా ఆనందం వ్యక్తం చేశారు. దేశ చారిత్రక సంస్కృతిని కాపాడడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని,  ఈ అవార్డులే తాము అతిథులకు మంచి ఆతిథ్యం ఇస్తున్నామనడానికి నిదర్శనమన్నారు.

 

Latest Updates