పెద్దోళ్ల నుంచి వసూలు చేసి..పేదలకు పంచుతాం: రాహుల్

కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకం పేదవాడి కష్టాలను తీర్చుతుందని, దేశ ఆర్థికవ్యవస్థను రీమానిటైజ్ చేస్తుందని ఏఐసీసీ చీఫ్ రాహుల్​గాంధీ చెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్​లో హోషంగాబాద్ లోక్​సభ అభ్యర్థి శైలేంద్ర సింగ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. మధ్యతరగతి నుంచి లాక్కుని పేదోళ్లకు ఇచ్చేందుకే న్యాయ్​ను ప్రతిపాదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్లను తప్పుబట్టారు. న్యాయ్​ద్వారా ఏ ఒక్క మధ్యతరగతి కుటుంబానికి పైసా నష్టం కానివ్వబోమని హామీ ఇచ్చారు. నీరవ్​మోడీ, లలిత్ మోడీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నరేంద్ర మోడీ ల నుంచి అవినీతి డబ్బు వసూలు చేసి పేదలకు పంచుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్​ద్వారా పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.6వేలు ఇస్తామని, తద్వారా వారికి కొనుగోలు శక్తి లభిస్తుందన్నారు. డీమానిటైజేషన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, పేదోడి చేతిలో డబ్బులు లేకుండా చేసిందన్నారు. డీమానిటైజేషన్ వల్ల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. అధికారంలోకి రాగానే మధ్యప్రదేశ్​లో వ్యాపమ్ కుంభకోణం పై దర్యాప్తు చేపడతామన్నారు.

Latest Updates