బెదిరించేటోళ్లు వెళ్లిపోవచ్చు : తలసాని

డివిజన్ కమిటీలు 25 లోగా పూర్తి చెయ్యాలి
గడువు పెంచే ప్రసక్తే లేదన్న తలసాని
సభ్యత్వాల నమోదుపై అసంతృప్తి 
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సమావేశం 

హైదరాబాద్, వెలుగు: పార్టీ నిర్ణయాలు అందరూ పాటించాలని, అలా కాదని అలిగి బెదిరించేటోళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. సభ్యత్వ నమోదు, బూత్, డివిజన్ కమిటీ లకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నేతలతో తెలంగాణ భవన్ లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు మందకొడిగా సాగడంపై పార్టీ నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవటం, కొందరు సీనియర్ల అసంతృప్తి కారణంగా అనుకున్న స్థాయిలో సభ్యత్వ నమోదు కాలేదనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం నాటికి సభ్యత్వాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. ఐతే బూత్, డివిజన్ కమిటీల విషయంలో మాత్రం ఇలాంటి అలసత్వం పనికిరాదని నేతలు, కార్యకర్తలకు తలసాని సూచించారు. క్రమశిక్షణ లేకపోతే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్నారు. సభ్యత్వ నమోదు ఈనెల 25లోగా పూర్తి చెయ్యాలని కార్యకర్తలకు, నాయకులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ పై విమర్శలు గుప్పించారు. నాలుగు సీట్లు రాగానే ఆగుతలేరన్నారు.

మళ్లీ వంద మంది కార్పొరేటర్లను గెలిపించుకోవాలి-: మహముద్ అలీ

టీఅర్ఎస్ కు ప్రస్తుతం సికింద్రాబాద్, హైదరాబాద్ బలంగా ఉందని.. కానీ ఆ స్థాయిలో సభ్యత్వాల నమోదు చేయడంలో విఫలమవటం మంచిది కాదని హోంమంత్రి మహముద్ అలీ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని.. పార్టీకి ప్రజల్లోనూ గౌరవం ఉందన్నారు. 2002 లో ఒక్క కార్పొరేటర్ ఉన్న గులాబీ పార్టీ, ఇప్పుడు వంద మంది కార్పొరేటర్లను గెలుచుకుందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ వంద కార్పొరేటర్లను గెలవాలంటే సభ్యత్వాల నమోదు లక్ష్యానికి మించి చేయాలని కోరారు.

సభ్యత్వ నమోదుకు ఇబ్బందులేంది: మేయర్

సభ్యత్వాలు తక్కువ కావటంపై మేయర్ బొంతు రామ్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండుసార్లు సమయం ఇచ్చినప్పటికీ లక్ష్యం పూర్తి చేయకపోవడంలో సమస్య ఏంటన్నారు. పార్టీ నిర్దేశించిన సభ్యత్వాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నామని విమర్శించారు. వేల కోట్లతో నగరాభివృద్ధి చేస్తుంటే సభ్యత్వాలు ఎందుకు అవ్వటం లేదని ప్రశ్నించారు. పార్టీ లో గ్రూప్ లు వద్దని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. కొత్త, పాత, చిన్న, పెద్ద అందరినీ కలుపుకొని పోయినప్పుడే పార్టీకి మంచి జరుగుతుందన్నారు. అంబర్ పేట్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ , దానం నాగేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ ఇన్​చార్జులు సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు.

ఒకే వేదికపై తలసాని, బొంతు

మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించటం విశేషం. ఎంపీ ఎన్నికల తర్వాత తలసాని హాజరయ్యే ప్రతీ కార్యక్రమానికి మేయర్ డుమ్మా కొడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ విషయం కేటీఆర్ వరకూ వెళ్లింది. దీంతో నేతలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

కార్పొరేటర్ల ఆలస్యంపై తలసాని సీరియస్​

సమావేశం 11 గంటలకు కాగా.. కొంత మంది కార్పొరేటర్లు ఆలస్యంగా వచ్చారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి సమావేశానికి గంట లేటుగా వచ్చారు. దీంతో పరోక్షంగా తలసాని విమర్శలు చేశారు. పార్టీ చెప్పిన సమయానికి అందరూ రావాల్సిందేనని, కొంత మంది తమకు కొమ్ములున్నాయని భావిస్తే కుదరని వ్యాఖ్యనించారు. అవసరమైతే కొమ్ములు విరిచేస్తామన్నారు. భవిష్యత్ లో జరిగే సమావేశాలకు ఆలస్యంగా వస్తే చర్యలు తప్పవన్నారు.

Latest Updates