ఇదే సామాజిక తెలంగాణ..ఇంకేం లేదు ఎక్స్అఫీషియోలను తెచ్చింది కాంగ్రెస్సే

హైదరాబాద్‌‌, వెలుగు: ఎక్స్​ అఫీషియో సభ్యులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ హయాంలోనే ఆ విధానాన్ని తెచ్చారని, టీఆర్ఎస్​చట్టప్రకారమే నడుచుకుంటోందని పేర్కొన్నారు. మున్సిపల్​ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తుపెట్టుకున్నాయని.. పైగా నిస్సిగ్గుగా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బడుగు బలహీవర్గాలకు టీఆర్ఎస్ ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరూ ఇవ్వలేదని, రాజకీయంగా గుర్తింపు లేని కులాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్​దేనని, సీఎం సామాజిక కోణంలో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని, సీఎం పాటించిన సామాజిక న్యాయసూత్రం ఈ విషయాన్ని నిరూపించిందని చెప్పారు. ఇదే సామాజిక తెలంగాణ అని, ఇంతకు మించి ఏమీ ఉండదన్నారు.

కాంగ్రెస్‌‌, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: శ్రీనివాస్ గౌడ్

మున్సిపల్​ ఎలక్షన్లలో కాంగ్రెస్‌‌, బీజేపీల మ్యాచ్ ఫిక్సింగ్ బట్టబయలైందని మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌‌ అన్నారు. వెయ్యి సీట్లలో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయని, టీఆర్‌‌ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు నీచ రాజకీయానికి ఒడిగట్టాయని విమర్శించారు. ‘‘బడుగు బలహీన వర్గాల అభినవ పూలే కేసీఆర్. ఇన్నాళ్లు అన్ని పార్టీలు అణగారిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. చట్టప్రకారం బీసీలకు ఈ ఎన్నికల్లో 23 శాతం సీట్లు కేటాయిస్తే.. సీఎం కేసీఆర్‌‌ 45 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి అభినవ ఫూలే అనిపించుకున్నారు. రాజకీయంగా గుర్తింపుకు నోచుకోలేకపోయిన, కార్లు కూడా లేని కులాల నేతలకు కేసీఆర్ పదవులిచ్చి కార్లలో తిరిగేలా చేశారు”అని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆంధ్రా ఎంపీ సహకారంతో నేరేడుచర్ల లో గెలవాలని చూశారని, అంతకన్నా సిగ్గు మాలిన చర్య ఏదైనా ఉంటుందా అని కామెంట్​ చేశారు. తెలంగాణను దోచుకున్న కేవీపీని ఏమొహం పెట్టుకుని ఎక్స్ అఫీషియో గా ఎంపిక చేసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పెడబొబ్బలు పెట్టినా జనం కర్రుకాల్చి వాతలు పెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు చవకబారు విమర్శలు మానుకోవాలని కామెంట్​ చేశారు.

 

Latest Updates