తాలిబన్లు ఇకపై పాక్ చేతిలో కీలుబొమ్మలు కాకపోవచ్చు

తాలిబన్లు ఇకపై పాక్ చేతిలో కీలుబొమ్మలు కాకపోవచ్చు
  • చేతికి అధికారం వచ్చింది కాబట్టి పాక్ నుంచి విముక్తి కోరే అవకాశం ఉంది
  • తాలిబన్లపై పాక్ ప్రభావితం కొన్ని అంశాలకే పరిమితం
  • భేదాభిప్రాయాలొచ్చినప్పుడు తాలిబన్లు సొంత మార్గం ఎంచుకునే అవకాశం
  • ఆఫ్ఘన్ క్రైసిస్ పై ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ హెచ్చరిక

ఆఫ్టనిస్తాన్ దేశాన్ని  స్వాధీనం చేసుకున్న తాలిబన్లను తక్కువగా అంచనా వేయొద్దని.. వారు ఇక ముందు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలుగా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉందని ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. తాలిబన్లు ఇన్నేళ్లుగా పాకిస్తాన్ సహాయ సహకారాలతో మనుగడ సాగించారన్న విషయం అందరూ అంగీకరించాల్సిన పచ్చినిజమని ఆయన పునరుద్ఘాటించారు. ఇంతకాలం తమకు అండదండగా నిలిచి సహాయం చేసిన పాకిస్తాన్ నుంచి వారు విముక్తి కోరుకునే అవకాశం ఉందని, ఇక ముందు తాలిబన్లపై పాకిస్తాన్ ప్రభావం కొన్ని అంశాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు. 
ఆఫ్ఘనిస్తాన్ పై పరిశోధనలు చేసి ‘‘రిటర్న్ ఆఫ్ ఏ కింగ్, ది బ్యాటిల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్’ పుస్తకం రాసి ఎన్నో సంచలన విషయాలు ఆయన బయటపెట్టారు. తాజాగా ఆయన అమెరికా బలగాలు వైదొలగిన అనంతరం మీడియా సంస్థలతో మాట్లాడుతూ భవిష్యత్ పరిస్థితులపై విశ్లేషించారు. తాలిబన్ల ఉద్యమం పాకిస్తాన్ ప్రేరేపిత ఉద్యమం అని చాలా మంది అభిప్రాయం నిజం కాదని, ఈ అభిప్రాయాలను తొలిగిపోయే రోజులు రానున్నాయని ఆయన తెలిపారు. తాలిబన్లది కచ్చితంగా ఆఫ్గనిస్తాన్ ఉద్యమమేనని, గత 25 ఏళ్లుగా తాలిబన్లకు నిధులు, ఆయుధాలు అందించి అండదండగా నిలిచిన పాక్ మద్దతు ఇప్పటికీ కొనసాగుతోందన్న విషయం అందరూ అంగీకరించాల్సిన నిజం అన్నారు. అయితే ఇకపై తాలిబన్లు స్వయం ప్రతిపత్తిపై పాలించే అవకాశం ఉందని, ఇంతకాలం తమకు యజమానిలా వ్యవహరించిన పాక్ నుంచి విముక్తి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయని డాల్రింపుల్ తెలిపారు. ఇకపై పాకిస్తాన్ ప్రభావం తాలిబన్ల మీద అంశాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని, పాక్-తాలిబన్ల మధ్య అభిప్రాయభేదాలొస్తే.. తాలిబన్లు స్వతంత్రమార్గం అనుసరించడానికే మొగ్గు చూపించే అవకాశం ఉందని ఆయన వివరించారు.