ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ గురించి చర్చ

  • ఆయన మంచి మనిషి, ముందడుగు వేశారు
  • తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే ఏపీకే కష్టం: జగన్​
  • ఎగువ రాష్ట్రాన్ని నమ్మితే నష్టపోతాం
  • సీఎంలు మారితే భవిష్యత్​లో ఇబ్బందులే: చంద్రబాబు

అమరావతి, వెలుగు“కేసీఆర్ మీద నాకేమీ ప్రేమ ఉండకపోవచ్చు. ఆయన మంచి మనిషి.  ఏపీకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు. తెలంగాణతో స్నేహ సంబంధం చాలా అవసరం” అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి మంచిది కాదని తెలిస్తే అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటామని  ప్రశ్నించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో క్వశ్చన్​ అవర్ లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు వద్దంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. ఇప్పుడున్న ప్రాజెక్టులకే తెలంగాణ నుంచి నీళ్లు రావడం లేదన్నారు. వాళ్లు భూములు బీడు పెట్టుకుని ఏపీకి నీళ్లిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణకు లాభం చేసేందుకు సీఎం జగన్ ప్రాజెక్టు కట్టి ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మీదుగా నీళ్లు వస్తే కంట్రోల్​ వాళ్ల చేతిలోనే ఉంటుంది. భవిష్యత్తులో సీఎంలు మారితే ఏపీ పూర్తిగా ఇబ్బంది పడుతుందని ఆయన హెచ్చరించారు.  టీడీపీ సభ్యుల ఆందోళనపై జోక్యం చేసుకున్న సీఎం జగన్ ఉమ్మడి ప్రాజెక్టుపై వివరించారు. “జూన్  నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలల్లో గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. రోజుకు 4 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే.. 120 రోజుల్లో 450 నుంచి 500 టీఎంసీలు వాడుకోవచ్చు. గోదావరి నీటిని సమర్థంగా వాడుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం.  తెలంగాణతో కలిసి నిర్మించే ప్రాజెక్టును ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తాం”అని అన్నారు.

ఇప్పటికే మిగులు జలాలు కోల్పోయాం: జగన్

ఏపీ అవసరమైన సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఇదే పరిస్థితి మరో పదేళ్లు కొనసాగితే కృష్ణా ఆయకట్టు ఎండిపోతుందన్నారు. మహారాష్ర్ట, కర్నాటక తరహాలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఏపీకి వచ్చే గోదావరి నీళ్లు మరింత తగ్గిపోతాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు రావాల్సిన 1200 టీఎంసీల్లో కేవలం 600 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లలో ఇది మరింత తగ్గి 400 టీంఎంసీలకు పడిపోయిందన్నారు. ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేకనే  జగన్ తో కేసీఆర్ కలుస్తున్నారనేది అబద్ధమని చెప్పారు. కొత్త ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు వచ్చి చేరుతాయని, అక్కడి నుంచి నాగార్జున సాగర్, రాయలసీమకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. ఇందులో తెలంగాణకే ఎక్కువ లాభం అనుకోవడానికి లేదని, శ్రీశైలం, సాగర్ పై ఏపీలోని 9 జిల్లాలు ఆధారపడి ఉంటే, తెలంగాణలో ఆధారపడ్డది కేవలం నాలుగు జిల్లాలేనన్నారు.  తెలంగాణలో కాళేశ్వరం కడుతుంటే సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేయలేకపోయారని, ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచేసి కడుతున్నా ఏం చేయగలుగుతున్నామని ప్రశ్నించారు. కాళేశ్వరం కారణంగా 450 టీంఎంసీలు, ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల 120 టీఎంసీల మిగులు జలాలను కోల్పోయామన్నారు. ఇంకా పక్క రాష్ర్టంతో శత్రుత్వం, కక్షసాధింపులు అంటూ కూర్చుంటే గోదావరి నీళ్లు ఏపీకి వచ్చే లోపే
ఆవిరైపోతాయన్నారు.

Latest Updates