ప్రేమోన్మాదం: టీచర్ గొంతు కోసి చంపిన యువకుడు

కడలూరు: తమిళనాడులో ఓ ప్రేమికుడి ఉన్మాదం.. యువతి నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ‘నువ్వంటే ఇష్టం లేదు’ అని ఆమె చెప్పిన పాపానికి అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని కడలూరు జిల్లా కురింజిపడి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
ఇక్కడి ఓ ప్రైవేటు స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తోంది 23 ఏళ్ల ఎస్ రమ్య. ఆమెను కాలేజీ రోజుల నుంచి రాజశేఖర్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. నాటి నుంచి ఆమె వెంట పడుతూనే ఉన్నాడు. అయితే అతడంటే రమ్యకు ఇష్టం లేదు. రాజశేఖర్ ప్రేమను ఆమె అంగీకరించలేదు. అయినా వదలకుండా వెంటబడ్డాడు. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడామెతో.. కానీ ఆమె నో చెప్పింది.
అయితే రాజశేఖర్ అక్కడితో వదల్లేదు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. వారు కూడా ఒప్పుకోలేదు. ఆ కోపంతో రగిలిపోయిన అతడు.. శుక్రవారం ఉదయం రమ్య పని చేసే స్కూలుకు వెళ్లాడు. రోజూ ఆమె అందరి కంటే ముందు స్కూలుకు వెళ్లి క్లాస్ రూమ్స్ తాళాలు తీసేది. ఇవాళ కూడా ముందే వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చుని ఉండగా వచ్చిన రాజశేఖర్ మరోసారి అతడి ప్రేమ విషయం అడిగాడు. ఆమె నో చెప్పడంతో తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
క్లాస్ రూం ఊడ్చేందుకు వచ్చిన మహిళ రక్తపు మడుగులో పడి ఉన్న రమ్యను చూసి కేకలు పెట్టుకుంటూ ప్రిన్సిపాల్ వద్దకు పరుగుపెట్టింది. ఆ విషయం చెప్పడంతో మేనేజ్ మెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని తన చెల్లెకు మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.

Latest Updates