రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణం చేసిన తమిళిసై

tamilisai-soundararajan-takes-oath-as-telangana-governor-in-hyderabad-rajbhavan

రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేశారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో తమిళిసై సౌందరరాజన్ తో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు.

చెన్నైనుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి శంషాబాద్ చేరుకున్న తమిళిసై.. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేటకు వచ్చారు.సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు, అధికారులు తమిళిసైకి స్వాగతం పలికారు. సీఎం సహా నేతలంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. నిర్ణయించిన సమయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ .. తమిళిసైతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత.. గవర్నర్ గా తమిళిసై తొలి సంతకాన్ని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, చీఫ్ జస్టిస్ వేదికపై గవర్నర్ కు ఫ్లవర్ బొకే ఇచ్చి అభినందనలు తెలియజేశారు. జనగణమనతో కార్యక్రమం పూర్తయింది.

ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే.. వేదిక నుంచి దిగారు గవర్నర్ తమిళిసై. ఎదురుగా అతిథుల్లో కూర్చున్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. వారితో ఫొటోలు దిగారు. అక్కడే ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గవర్నర్ కు శుభాకాంక్షలు అందజేశారు.

Latest Updates