గవర్నర్​గా తమిళిసై మొదటి ప్రసంగం

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

8న రాష్ట్ర బడ్జెట్​.. 

గవర్నర్​తో సీఎం భేటీ.. ప్రసంగం కాపీ అందజేత

మార్చి 21, 24 వరకు అసెంబ్లీ సమావేశాలకు చాన్స్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు శుక్రవారం మొదలు కానున్నాయి. మొదటిరోజు అసెంబ్లీ, మండలి జాయింట్​ మీటింగ్​ జరుగనుంది. ఇందులో గవర్నర్​ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్​గా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్​సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్​బుధవారం గవర్నర్ తమిళిసైని కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై వివరించారు. అసెంబ్లీ జాయింట్​మీటింగ్ కు సంబంధించిన ప్రసంగం కాపీని గవర్నర్​కు అందజేశారు. ఈ నెల 8న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. బడ్జెట్​రూపకల్పన, దానిలోని పలు కీలక అంశాలను సైతం గవర్నర్​ దృష్టికి తెచ్చారు. సాగునీటి పారుదల, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కొనసాగించనున్నట్లు సీఎం వివరించారు. మార్చి 21 లేదా 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న బీఏసీ మీటింగ్​లో దీనిపై స్పష్టత రానుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవాలని సీఎం భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పలుసార్లు చెప్పారు.

ఆఫీసర్స్ లాంజ్​ఓపెనింగ్

అసెంబ్లీ బిల్డింగ్​లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్​ని బుధవారం స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి  పోలీసు శాఖ ఉన్నతాధికారులతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలి వైస్ చైర్మన్​ నేతి విద్యాసాగర్,  అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​టి.పద్మారావు, ప్రభుత్వ చీఫ్​ విప్​లు దాస్యం వినయభాస్కర్, బోడకుంట వెంకటేశ్వర్లు, సీఎస్​ సోమేశ్​కుమార్, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ప్రిన్సిపల్​ సెక్రటరీ రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, డీజీపీ మహేందర్​రెడ్డి, ఎస్పీఎఫ్​ డీజీ తేజ్​దీప్​కౌర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

Latest Updates