
దేశ రాజధాని ఢిల్లీ. ఆర్మీ డే జరుగుతోంది. పరేడ్ స్టార్టయింది. ఓ జవాను సైనిక దళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అందరూ పరేడ్ కమాండింగ్ ఆఫీసర్ వైపే చూస్తున్నారు. మీడియా కళ్లూ తన వైపే. దేశ చరిత్రలో ఆర్మీ డే పరేడ్‌కు తొలిసారి ఓ యువతి నాయకత్వం వహించడం చూస్తున్నారు మరి. అది కూడా ఆల్ మెన్ కంటింజెంట్స్‌కు. పైగాసైనికులందరిలో ఒకే ఒక్క మహిళ తాను. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జనమందరి చూపును ఆ యువతి తనవైపు తిప్పుకుంది. చరిత్రలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అందరితో శెభాష్ అనిపించుకుంది. ఆమె పేరు కెప్టెన్ తానియా షెర్గిల్. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లోనూ ఆర్మీ కంటింజెంట్‌ను తనే లీడ్ చేయబోతున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఓ మహిళ నాయకత్వం వహించడం కొత్తేం కాదనుకోండి. ఆర్మీ డే పరేడ్‌లో దళాన్ని తానియా లీడ్ చేసిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్ చేశారు. దాన్ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేసి ‘నిజంగా ఇది సంతోషకరం. తానియా అందరికీ ఇన్‌స్పిరేషనల్. తనో నిజమైన సెలబ్రిటీ’ అని ట్వీట్ చేశారు.
ఎవరీ తానియా?
తానియాది ఆర్మీ ఫ్యామిలీ. తను హోషియార్‌పూర్‌లో పుట్టారు. నాగపూర్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2017లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న 1 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్‌లో పని చేస్తున్నారు. ఢిల్లీలో తన తల్లి టీచర్‌గా పని చేశారు. తండ్రి సూరత్‌సింగ్ షెర్గిల్ రిటైర్మెంట్ తర్వాత పంజాబ్‌లోని హోషియార్‌పూర్ రాష్ట్రంలోని చిన్న టౌన్ గర్దివాలాకు షిఫ్ట్ అయ్యారు. తానియా ముత్తాత మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు.
తొలి మహిళ నేనే అవుతానని తెలుసు
‘బీటెక్ చివరి సంవత్సరంలోనే ఆర్మీకి అప్లై చేశా. సెలెక్ట్ అయ్యా. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నా. 2017లో కోర్ ఆఫ్ సిగ్నల్స్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆర్మీ యాజుటెంట్ సెలెక్షన్ జరుగుతున్నప్పుడు ఒకవేళ నేను గనక సెలెక్టయితే ఆర్మీ డే రోజున పరేడ్‌ను లీడ్ చేసే తొలి మహిళ నేనే అవుతానని నాకు తెలుసు. ఈ అవకాశం నాకు దక్కడం నిజంగా సంతోషం’
– తానియా షెర్గిల్