అక్కలను చంపిన ఉన్మాది కోసం టాస్క్ ఫోర్స్..

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట లో ముగ్గరు అక్కలపై కత్తితో దాడి చేసి చంపిన ఉన్మాది ఇస్మాయిల్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. హత్యలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిటీలో తెలిసిన అడ్డాల్లోనే తలదాచుకుని ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. నిందితుడు ఉన్మాదంతో సైకోలా మారినందున తమకు దొరికే లోపు మళ్లీ అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిందితుడిని వీలైనంత వేగంగా.. సురక్షితంగా పట్టుకోవాలని యోచిస్తున్నారు. ఆస్తి తగాదాల వల్లే హత్యలు జరిగాయని.. అక్కల మాటను నమ్మి భార్యను చంపి హంతకుడైనానని అక్కసుతో అక్కలను కడతేర్చినట్లు తెలుస్తోంది. ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో అక్క.. బావల దగ్గర నిఘా పెట్టారు. భార్య హత్య కేసులో బెయిల్ పై వచ్చి పథకం ప్రకారం ముగ్గురు అక్కలపై కత్తి నిందితుడు ఇస్మాయిల్ కత్తితో దాడి చేయడంతో రజియబేగం , జకిరాబేగం అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడో సోదరి నూరా బేగం ఆమె భర్త అహమ్మద్ ఇస్మాయిల్ లను కూడా కడతేర్చే ప్రమాదం ఉందని బంధువుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూరా బేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది తన అక్కలు చెప్పడంతో భార్య ను గొంతు కోసి చంపి జైలుకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని ముగ్గురు అక్కలు తన ఆస్తి కొట్టేయాలని చూశారని నిందితుడు ఇస్మాయిల్ ఆగ్రహంతో ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.