కంపెనీల్లో సీఎస్​ఆర్​ జాబ్​ కొడితే.. ఎంట్రీ సాలరీ రూ.60 వేలు

  • టిస్ భాగస్వామ్యంలో బాలవికాస పీజీ డిప్లొమా కోర్సులు
  • కార్పొరేట్ కంపెనీల్లో ప్లేస్‌‌మెంట్స్ 
  • ప్రారంభ వేతనంరూ.60-70 వేలు

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌‌బిలిటీ రంగంలో స్థిర పడాలనే వారి కోసం టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సస్(టిస్) ముంబై, స్వచ్ఛంద సంస్థ బాల వికాస కలిసి పీజీ డిప్లొమా కోర్సును ప్రకటించాయి. ‘ఇన్నోవేటివ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌‌బిలిటీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కోర్సు ద్వారా డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి తెలిపారు. దీంతో పాటు ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్‌ను  ప్రమోట్ చేసేందుకు ‘సోషల్ ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్’ అనే కోర్సును కూడా అందించనున్నట్టు చెప్పారు. సమాజ సేవలో పాలుపంచుకోవాలనుకునే వారికి తమ సంస్థ ద్వారా ఈ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు.  ప్రస్తుతం కంపెనీలు తాము పొందే లాభాల్లో 2 శాతాన్ని సీఎస్‌‌ఆర్‌‌‌‌ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో కంపెనీల్లో సీఎస్‌‌ఆర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్ తప్పనిసరైంది. కంపెనీలు కూడా సీఎస్‌‌ఆర్‌‌‌‌ యాక్టివిటీస్‌‌లో అనుభవం, శిక్షణ పొందిన వారిని నియమించుకోవడానికి చూస్తున్నాయని అన్నారు. కంపెనీలకు శిక్షణ పొందిన సీఎస్‌‌ఆర్‌‌‌‌ అభ్యర్థులను అందించడమే ఈ కోర్సు లక్ష్యమని చెప్పారు. సామాజిక సేవా రంగంలో పలు రకాల శిక్షణలు ఇస్తోన్న టిస్ భాగస్వామ్యంలో, ఈ కోర్సును బాల వికాస నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కోర్సుల కోసం నేటి నుంచి మార్చి 15 వరకు ‌‌ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్ స్వీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి.

ఆన్‌‌లైన్ అప్లికేషన్స్ www.bvic.in లో లభ్యమవుతాయి.  ఇటీవల 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్‌‌‌‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సెంటర్‌‌‌‌లోనే కంపెనీలకు కూడా సీఎస్‌‌ఆర్ కార్యక్రమాలపై బాల వికాస శిక్షణ ఇస్తోంది. అక్కడకు వచ్చే కంపెనీలు, టిస్‌‌కున్న పరిచయాలతో.. కోర్సుల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేసి, ప్లేస్‌‌మెంట్స్ పొందేలా అరేంజ్ చేస్తామన్నారు శౌరిరెడ్డి. కోర్సులకు 50 నుంచి 60 మంది చొప్పున శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నెలల వ్యవధి ఉండే కోర్సుల ఫీజు రూ.3 లక్షల వరకు ఉందన్నారు. విద్యార్థులకు స్కాలర్‌‌‌‌షిప్‌‌ల కూడా అందిస్తామని తెలిపారు. తాము అందించే ఈ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి, ఎంట్రీ లెవల్ శాలరీగా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉండొచ్చన్నారు.

Latest Updates