మైలాన్‌ నుంచి టీబీ డ్రగ్‌

హైదరాబాద్‌‌: క్షయ వ్యాధి చికిత్సలో ఉపయోగించే డ్రగ్‌‌ తయారీ కోసం డ్రగ్‌‌ కంట్రోలర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ ఇండియా (డీసీజీఐ)తో కలిసి పనిచేస్తున్నామని ప్రముఖ ఫార్మా కంపెనీ మైలాన్‌‌ తెలిపింది. టీబీ చికిత్స కోసం ప్రెటోమనీడ్‌‌ డ్రగ్‌‌ తయారు చేయడానికి స్వచ్ఛందసంస్థ టీబీ అలయన్స్‌‌తోనూ ఇది ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం డీసీజీఐకి డ్రగ్‌‌ అప్లికేషన్‌‌ కూడా అందజేశామని, చర్చలు తుది దశలో ఉన్నాయని మైలాన్‌‌ ఈడీ రాజీవ్‌‌ మాలిక్‌‌ చెప్పారు. అనుమతులు వచ్చాక దీనిని ఇండియాలోనూ విడుదల చేస్తామని వెల్లడించారు.

2025 నాటికి ఇండియాను క్షయరహితంగా మారుస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యసాధనలో ప్రెటోమనీడ్‌‌ ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. అమెరికాలో ఈ ఏడాదిలోపే దీనిని విడుదల చేయడానికి మైలాన్‌‌ ప్రయత్నిస్తోంది.  తదనంతరం ఇతర దేశాలకు దీనిని తీసుకొస్తామని తెలిపింది. టీబీ అలయెన్స్‌‌ ఇది వరకే ఈ డ్రగ్‌‌ కోసం క్లినికల్‌‌ ట్రయల్స్‌‌ నిర్వహిస్తున్నది. గత 40 ఏళ్లలో యూఎస్ ఫుడ్‌‌ అండ్ డ్రగ్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ (ఎఫ్‌‌డీఏ) కేవలం మూడే టీబీ డ్రగ్‌‌లకు అనుమతి ఇవ్వగా, వీటిలో ప్రెటోమనీడ్‌‌ ఒకటి. ఇండియాలో 27 లక్షల మంది క్షయ రోగులు ఉన్నారు.

Latest Updates