నెలలోనే లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్ల మైలురాయి చేరింది

  • నెలలోనే రూ.500 పెరిగిన షేర్
  • అక్టోబర్ 7న ఫలితాలు, డివిడెండ్ ప్రకటించే అవకాశం
  • పరిశీలనలో బైబ్యాక్ ప్రపోజల్ కూడా

టాటా గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ సోమవారం రూ.10 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తొమ్మిది లక్షల కోట్ల మార్కును దాటిన నెల రోజుల్లోనే రూ.10 లక్షల కోట్ల మైలురాయిని టీసీఎస్ చేరుకోవడం విశేషం.

న్యూఢిల్లీ: దేశంలో రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ను దాటిన రెండో కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌(టీసీఎస్‌‌) నిలిచింది. షేర్లను బై బ్యాక్ చేసే ఆలోచన ఉందని టీసీఎస్‌‌  పేర్కొనడంతో  సోమవారం సెషన్‌‌లో కంపెనీ షేర్లు  ఏడు శాతానికి పైగా లాభపడ్డాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో టీసీఎస్‌‌ షేరు 7.55 శాతం లాభపడి రూ. 2,713.95 వద్ద క్లోజయ్యింది. గత నెలలో కంపెనీ మార్కెట్‌‌ క్యాప్‌‌ రూ. 9 లక్షల కోట్లను దాటి, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ తర్వాత అతిపెద్ద కంపెనీగా నిలిచింది.  ప్రస్తుతం రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ మార్కెట్‌‌ క్యాప్ రూ. 15 లక్షల కోట్లకు పైనుంది.

ఒకానొకప్పుడు మార్కెట్ క్యాప్‌‌ పరంగా టీసీఎస్‌‌, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ పోటీపడేవి. కానీ రిలయన్స్‌‌  టెలికాం, రిటెయిల్ బిజినెస్‌‌లలోకి భారీగా ఇన్వెస్ట్‌‌మెంట్లు రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ మార్కెట్‌‌ వాల్యూ గత కొన్ని నెలల్లో  ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ నెల 7 న జరగనున్న కంపెనీ బోర్డ్‌‌ మీటింగ్‌‌లో  క్వార్టర్లీ రిజల్ట్స్‌‌ను టీసీఎస్ ప్రకటించనుంది.  అంతేకాకుండా ఇన్వెస్టర్లకు సెకెండ్‌‌ ఇంటెరిమ్‌‌ డివిడెండ్‌‌ను ప్రకటించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌కు గాను రెవెన్యూ రూ. 38,926 కోట్లుగా ఉంటుందని  బ్లూమ్‌‌బర్గ్‌‌ ఎనలిస్టుల అంచనా. రూ. 7,754 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించొచ్చని తెలిపారు.   కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కంపెనీ షేరు 22.32 శాతం పెరిగింది.

టీసీఎస్‌‌ బై బ్యాక్‌‌..

‘కంపెనీ ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి బై బ్యాక్‌‌ ప్రపోజల్‌‌ను బోర్డ్‌‌ ఆఫ్‌‌ డైరక్టర్లు పరిశీలిస్తున్నారు’ అని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో టీసీఎస్ పేర్కొంది. ఈ నెల 7 న బోర్డు మీటింగ్ ఉందని తెలిపింది.  బై బ్యాక్‌‌ సంబంధించి ఎటువంటి వివరాలు బయటపడలేదు. కంపెనీ 2018 లో రూ. 16 వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌‌ను షేరు ధర రూ. 2,100 వద్ద  చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బై బ్యాక్‌‌కు వెళ్తున్న మొదటి టెక్నాలజీ కంపెనీగా టీసీఎస్‌‌ నిలవనుంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ వద్ద రూ. 73,993 కోట్ల క్యాష్‌‌ నిల్వలు ఉన్నాయని అంచనా.

ఎపిక్‌‌ కేసు కోసం రూ. 1,218 కోట్లు..

ఎపిక్‌‌ సిస్టమ్స్‌‌ కేసుకు  సంబంధించి  త్వరలో ప్రకటించనున్న క్వార్టర్లీ రిజల్ట్స్‌‌లో రూ. 1,218 కోట్లను కేటాయించనున్నామని  టీసీఎస్‌‌ తెలిపింది. జాగ్రత్తగా ఉండడం కోసమే ఈ డబ్బులను కేటాయిస్తామని కంపెనీ పేర్కొంది. కాగా,  ఇంటలెక్చువల్‌‌ ప్రాపర్టీని దొంగిలించిందనే ఆరోపణలతో టీసీఎస్‌‌కు వ్యతిరేకంగా 2016 లో యూఎస్ కోర్టులో  ఎపిక్‌‌ సిస్టమ్స్‌‌ కేసు ఫైల్‌‌ చేసింది.  ఈ కేసుకు సంబంధించి  940 మిలియన్‌‌ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని  2016 లో యూఎస్‌‌ కోర్టు టీసీఎస్‌‌ను ఆదేశించింది. ఈ ఎపిక్‌‌ కేసుకు సంబంధించి తగిన వివరాలను కంపెనీ బయటపెట్టడం లేదని  ఈ ఏడాది ప్రారంభంలో టీసీఎస్‌‌కు  సెబీ వార్నింగ్ ఇచ్చింది. కాగా,  2017 లో విస్కన్సిన్‌‌ కోర్టు ఈ అమౌంట్‌‌ను 420 మిలియన్‌‌ డాలర్లకు తగ్గించింది. ఆ తర్వాత కూడా ఈ అమౌంట్‌‌ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ ఎపిక్‌‌ కేసుకు సంబంధించి 140 మిలియన్‌‌ డాలర్లను టీసీఎస్‌‌ చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి రీహియరింగ్‌‌ కోసం అప్పీల్స్ కోర్టులో పిటీషన్‌‌ను దాఖలు చేశామని సెప్టెంబర్‌‌‌‌లో టీసీఎస్‌‌  పేర్కొంది.

Latest Updates