వైసీపీ వాళ్లు తిడితే పవన్‌లాగా నేనూ పడాలా?

అనంతపురం: తాను రూ.2 లక్షల కోట్ల విలువ చేసే అమరావతిని అప్పగిస్తే సీఎం జగన్ చేతకానితనంతో దాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలంతా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలో అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసాలు చేయడంలో జగన్ దిట్ట అని ఆరోపించారు. వైసీపీ నేతలు తిడితే తాను కూడా పవన్ కల్యాణ్ లాగా పడాలా అని ప్రశ్నించారు చంద్రబాబు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బూతులు మాట్లాడుతున్నారని, ఇలా చేయడం సబబేనా అని ఆయన మండిపడ్డారు.

నేనూ సీమ బిడ్డనే

తాను రాయలసీమకు వ్యతిరేకం కాదని, తాను కూడా సీమ బిడ్డనేనని చెప్పారు చంద్రబాబు. అనంత జిల్లా ప్రజలు విశాఖకు వెళ్లాలంటే నాలుగు రోజులు పడుతుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతానని తాను గతంలోనే చెప్పానన్నారు. కానీ జగన్ హైకోర్టును మూడు ముక్కలు చేస్తానని అంటున్నారని, దీనికి కేంద్రం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. మోసాలు చేయడంలో జగన్ దిట్ట అని, అందుకే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని అన్నారాయన.

అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా

రూ.2 లక్షల కోట్ల విలువైన అమరావతిని అప్పగిస్తే జగన్‌కు చేతకాక నాశనం చేస్తున్నారని అన్నారు చంద్రబాబు. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి రెఫరెండానికి సిద్ధం కావాలని, ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాలనే వదిలేస్తానని స్పష్టం చేశారు.

Latest Updates