మ‌ద్య నిషేధానికి ఇదే బెస్ట్ టైమ్.. క‌మీష‌న్ల కోసం ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు

ఏపీలో లిక్క‌ర్ షాపులు తెరవడం, ధరలు పెంచడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం వల్ల రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ మే 4 నుంచి లిక్క‌ర్ షాపులు తెరిచేందుకు అనుమ‌తివ్వ‌డంతో ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రారంభించ‌డంపై ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో మ‌ద్య నిషేధం హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు లాక్ డౌన్ స‌మ‌యంలో తొంద‌ర‌ప‌డి లిక్క‌ర్ షాపులు తెర‌వాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు.

ధ‌ర‌లు పెంచితే మ‌ద్య‌పాన నియంత్ర‌ణ జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. అస‌లు మ‌ద్య నిషేధం చేయాల‌నుకుంటే ఇంత‌కంటే బెస్ట్ టైమ్ ఉండ‌ద‌ని అన్నారు. ఇష్టానుసారం మద్యం దుకాణాలు తెరిచారని, అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల వద్ద పెడతారా? అని ప్రశ్నించారు.

జే ట్యాక్స్ కోస‌మే..

మద్యం షాపులకు వారికి న‌చ్చిన బ్రాండ్ మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని, జే ట్యాక్స్‌ కోసం నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మద్యపాన నిషేధం చేయాలనుకుంటే లాక్ డౌన్ స‌మ‌యంలో షాపుల‌ను పూర్తి మూసేయాల‌ని అన్నారు. తొందరపడి మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారని, కమీషన్లు పోతాయని ప్రజల జీవితాలతో ఆడుకోవ‌డం త‌గ‌ద‌ని మండిప‌డ్డారు.

చ‌ట్టాన్ని గౌర‌వించి ఇంట్లోనే ఉన్నా..

పదే పదే వైసీపీ నేతలు తనను హైదరాబాద్‌లో ఉన్నానని విమర్శించడంపై చంద్రబాబు స్పందించారు. తాను ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు ఇంట్లో ఉండలేదన్న చంద్రబాబు.. లాక్‌డౌన్ కారణంగా చట్టాన్ని గౌరవించి తాను ఇంట్లోనే ఉండిపోయానని స్పష్టం చేశారు. అలాంటి తనపై వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Latest Updates