వైసీపీలోకి వలసలు: ఆమంచి, అవంతి, నెక్ట్స్ రవీంద్ర బాబు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఫ్యాన్ గాలి జోరుగా వీయబోతోందని సర్వేలన్నీ చెబుతుండడంతో జగన్ పార్టీ వైపు టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారు. నిన్న ఆమంచి, నేడు అవంతి, నెక్స్ట్ రవీంద్ర బాబు ఇలా వరుసగా వైసీపీలోకి వలస బాటపడుతున్నారు.

ప్రభుత్వ కార్యకలాపాల్లో కొన్ని శక్తులు పెరిగిపోయాయంటూ ఆమంచి ఆరోపణలు

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్న టీడీపీకి రాజీనామా చేసి జగన్ పార్టీలోకి చేరారు. ఆయన తన రాజీనామా లేఖను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి…. నియోజకవర్గంలోనూ, రాష్ట్రంలోనూ….. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయం పెరిగిపోయిందని.. ఆ కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ప్రతి పనిలోనూ పార్టీకీ, ప్రభుత్వానికీ సంబంధంలేని కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని.. అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

టీడీపీ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లబోతున్నట్లు ముందు నుంచే వార్తలు రావడంతో సీఎం చంద్రబాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు. అయినా అవేవీ సంతృప్తినివ్వకపోవడంతో వైసీపీలోకి జంప్ చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మంచి స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నేడు అవంతి

విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం ఉదయం టీడీపీకి రాజీనామా చేశారు. గతకొంతకాలంగా చంద్రబాబు పరిపాలన, టీడీపీ తీరుతో అసంతృప్తితో ఉన్న అవంతి శ్రీనివాస్‌ గురువారం హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో భేటీ అయ్యారు. తర్వాత వైఎస్‌ జగన్‌ సమక్షంలో లాంఛనంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలోని అవంతి విద్యా సంస్థల చైర్మన్ అయిన ఆయన అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్న ఆయన పార్టీ మారడం టీడీపీ పెద్ద దెబ్బేనని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

మరో ఎంపీ కూడా

అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు కూడా టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ రోజు లేదా రేపు జగన్ ని కలిసి పార్టీ మారే అవకాశం ఉంది.

Latest Updates