కోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తా

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి… వారికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో వ్యవహరించాడు.తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. లేదంటే ఆమె పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది.

న్యూ చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలను అమ్ముతుంది. అదే గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు స్థానిక ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను శ్రీనివాసరావు వెంబండించాడు. ఆమె ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

కోరిక తీర్చితే.. స్కూల్లో చదువుతున్న నీ పిల్లలకు చదువు చెబుతా లేదంటే… వారి భవిష్యత్ ను నాశనం చేస్తానంటూ బెదిరిస్తూ.. ఆ మహిళతో గొడవకు దిగాడు. అడ్డువచ్చిన మహిళ తల్లిదండ్రులపై దాడి చేశాడు. వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానికులు బెల్లంకొండ క్రాస్ రోడ్డు దగ్గర ఆందోళన చేపట్టారు. అనూచితంగా ప్రవర్తించిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని… వెంటనే విధుల నుంచి తొలగించి బాధితురాలికి న్యాయం చేయాలని ధర్నా చేశారు. ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

Latest Updates