సెలవులొద్దు.. బడులు తెరవండి : టీచర్స్‌, పేరెంట్స్‌ డిమాండ్

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించడాన్ని పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ తప్పుబడుతున్నారు. దసరా సెలవులను ఈ నెల 20 వరకు పొడిగింపును వివిధ సంఘాల నేతలు విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సెలవులు పొడగించడమేంటని నిలదీస్తున్నారు. స్కూళ్లకు దసరా సెలవులను పొడిగించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) పేర్కొంది. ప్రభుత్వం పట్టుదలతో విద్యార్థులు నష్టపోతున్నారని కమిటీ నేతలు సీహెచ్‌ రాములు, రవి(యూటీఎఫ్‌), అశోక్‌కుమార్‌, శ్రీనివాస్‌(టీపీటీఎఫ్‌), రఘుశంకర్‌రెడ్డి, లింగారెడ్డి(డీటీఎఫ్‌), పోచయ్య (ఎస్టీఎఫ్‌), షౌకత్‌ అలీ(టీఎస్‌పీటీఏ), రమేశ్‌(బీటీఎఫ్‌), జాడి రాజన్న (ఎస్సీ,ఎస్టీటీఏ) తదితరులు మండిపడ్డారు. సెలవులు ఎక్కువై పిల్లల చదువు తగ్గిపోతోందని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌(టీపీఏ) ఆరోపించింది. ఏపీలో దసరా సెలవులు12 రోజులు ఇస్తే తెలంగాణలో 16 రోజులు ఇచ్చారని, ఇప్పుడు సెలవులు పెంచితే 23 రోజులవుతుందని అన్నారు. సెలవులు పెంచుతూ పోతే విద్యారంగం మరింత దిగజారుతుందని ఆరోపించారు.
సెలవులను పెంచడం ద్వారా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనని టీచర్స్​ జాక్టో ఆరోపించింది. పిల్లలను విద్యకు దూరంచేయడం విద్యాహక్కు ఉల్లంఘనేనని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్చుతరావు విమర్శించారు.

Latest Updates