స్పౌజ్​ బదిలీల నిషేధంపై టీచర్ల ఆగ్రహం

స్పౌజ్​ బదిలీల నిషేధంపై టీచర్ల ఆగ్రహం
  • 13 జిల్లాల్లో స్పౌజ్​ బదిలీల నిషేధంపై టీచర్ల ఆగ్రహం
  • ప్రగతిభవన్​ ముట్టడికి యత్నం.. 
  • డీఈవో ఆఫీసులు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
  • దంపతులను ఒకే జిల్లాకు అలాట్ చేయాలని డిమాండ్ 
  • పిల్లలను దృష్టిలో పెట్టుకొనైనా నిర్ణయం తీసుకోవాలని వినతి
  • సీఎం చెప్పిన మాటలను గుర్తుచేస్తూ నినాదాలు
  • ఎక్కడికక్కడ అరెస్టులు
  • స్కూళ్ల పేర్లు తెల్వకుండనే ఆప్షన్లు ఎట్లియ్యాలె?
  • మల్టీ జోన్లు మారిన హెడ్మాస్టర్లకు కొత్త ప్రాబ్లం

హైదరాబాద్ / హనుమకొండ / మంచిర్యాల, వెలుగు: టీచర్ల బదిలీల్లో సర్కారు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. భార్య ఒక జిల్లాలో.. భర్త మరో జిల్లాలో పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించారంటూ టీచర్లు మండిపడుతున్నారు. 13 జిల్లాల్లో స్పౌజ్​ బదిలీలను నిషేధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భార్యాభర్తలైన ఉద్యోగులను ఒకే జిల్లాలో అలాట్ చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఉదయం నుంచి పలు జిల్లాల నుంచి టీచర్లు ప్రగతిభవన్​ పరిసరాల్లోకి చేరుకొని.. ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో కేసీఆర్​ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ నినాదాలు చేశారు. పలు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ఎక్కడికక్కడ టీచర్లను పోలీసులు అడ్డుకొని అరెస్టుచేశారు. 
ఉద్యోగులు, టీచర్ల బదిలీల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 317పై మొదటి నుంచి వివాదం నడుస్తున్నది.

కేవలం సీనియారిటీ బేస్​ చేసుకొని అలాట్​మెంట్లు ఇవ్వడంపై జూనియర్​ ఉద్యోగులు, టీచర్లు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. తాము స్థానికతను కోల్పోవాల్సి వస్తున్నదని అంటున్నారు. దీనికి తోడు ఉద్యోగ దంపతులు ఒకే జిల్లాలో పనిచేసేలా చేపట్టే స్పౌజ్​ బదిలీలను 13 జిల్లాల్లో నిషేధించడంపై ఆయా జిల్లాల్లోని  టీచర్లు మండిపడుతున్నారు. కొందరి విషయంలోనైతే భార్య, భర్తకు పనిచేసే ప్లేస్​ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇట్లయితే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని, వారి ఆలనా పాలన ఎవరు చూసుకుంటారని బాధిత టీచర్లు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దంపతులు ఒకే జిల్లాలో పనిచేసేలా చూస్తామని గతంలో సీఎం కేసీఆర్​ పలు మార్లు హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. 
ఎక్కడికక్కడ అరెస్టులు
స్పౌజ్​ బదిలీలు చేపట్టాలంటూ బుధవారం ప్రగతిభవన్​ ముట్టడికి టీచర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. సీఎం కేసీఆర్​కు వినతిపత్రం ఇచ్చి వెళ్తామని టీచర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఎక్కడికక్కడ అరెస్టు చేసి పంజాగుట్ట, ఎస్ఆర్​నగర్​, గోషామహల్ పోలీస్​స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లు మాట్లాడుతూ... అంతర్ జిల్లా స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కు సంబంధించిన బ్లాక్ లిస్టులో పెట్టిన 13 జిల్లాలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. జిల్లాల్లో బ్లాక్ చేసిన అన్ని ఖాళీలను చూపుతూ, భార్యాభర్తల బదిలీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

జీవో 317లో స్పౌజ్ బదిలీలకు అవకాశమిస్తామని చెపితే, ఎంప్లాయీస్ అంతా సంతోషించారని, తీరా ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత 19 జిల్లాలకే స్పౌజ్ ట్రాన్స్​పర్లు చేసి, మిగిలిన జిల్లాలను పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల కొందరు దంపతులైతే 150 నుంచి 200 కిలో మీటర్ల దూరంలో పనిచేయాల్సి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా భార్యొక జిల్లాలో.. భర్తొక జిల్లాలో పనిచేస్తుంటే పిల్లలను ఎట్ల చూసుకునేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లాల అలకేషన్​ టైమ్​లో ఫైనల్ సీనియార్టీ లిస్టు గానీ ఫైనల్ అలాట్మెంట్ లిస్టు గానీ డిస్​ప్లే చేయకుండా ఏకపక్షంగా అలాట్ చేశారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
డీఈవో ఆఫీసులు, కలెక్టరేట్ల దగ్గర..
స్పౌజ్​ ట్రాన్స్​ఫర్లను చేపట్టాలని డిమాండ్​ చేస్తూ హనుమకొండ డీఈవో ఆఫీస్​దగ్గర కొంతమంది టీచర్లు దీక్ష చేపట్టగా, అక్కడి పబ్లిక్​ గార్డెన్ లో సుమారు 300 మంది టీచర్​ జంటలు తమ పిల్లలతో తరలివచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేశారు.  జీవో 317 వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఆ జీవోను రద్దు చేయాలన్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 13 జిల్లాల్లో ఆపేసిన స్పౌజ్​ ట్రాన్స్​ఫర్లను వెంటనే చేపట్టాలన్నారు. మంచిర్యాలలో బాధిత టీచర్లు కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు. . జిల్లాలో స్పౌజ్​ బదిలీలకు పర్మిషన్​ ఇచ్చి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్​కు మెమోరాండం అందజేశారు.
అరెస్టులు సరికాదు: సంఘాల నేతలు
తమ సమస్యలను తెలిపేందుకు ప్రగతిభవన్​ వచ్చిన టీచర్లను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్​, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్​రెడ్డి, టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నాయక్ అన్నారు. ఫ్రీజింగ్ చేసిన 13 జిల్లాల్లోనూ స్పౌజ్ బదిలీలకు చాన్స్​ ఇవ్వాలని కోరారు. అరెస్టు చేసిన వారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ​
2018 మే 16న సీఎం కేసీఆర్ ఏం చెప్పిన్రంటే..!
భార్యాభర్తలను కచ్చితంగా ఒకేచోటికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చినం.. జీవోలు ఇచ్చినం. ఈ బదిలీల సందర్భంలోనే వందకు వంద శాతం వైఫ్ అండ్ హస్బెండ్​ను ఒకే చోటికి తీసుకురావాలని చెప్పిన. భార్య ఉన్నచోటికి భర్తను గానీ, భర్త ఉన్న చోటికి భార్యను గానీ బదిలీ చేయాలని ఆదేశాలిచ్చిన.  99.99% స్పౌజ్ కేసులు ఒకే చోటికి తెస్తరు. ఎక్కడైనా రేర్ కేసుల్లో ఒకే ఊరిలో, టౌన్ లో గానీ, మండలంలో వేసే పరిస్థితి లేకపోతే పక్కపక్కనైనా వేయాలని చెప్పినం..
13 జిల్లాల్లో 2,566 అప్లికేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు స్పౌజ్ బదిలీలకు అవకాశమిచ్చి, 13 జిల్లాలను బ్లాక్​ చేసింది. బ్లాక్​ చేసిన జిల్లాల్లో.. రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, పాలమూరు, మంచిర్యాల, సూర్యాపేట ఉన్నాయి. ఈ  13 జిల్లాల పరిధిలో మొత్తం 2,566 మంది టీచర్లు స్పౌజ్ అప్లికేషన్లు పెట్టుకోగా.. వాటిలో 1,110 ఎస్జీటీలే ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు, పండిట్లు ఇతరులు కలిపి 1,456 మంది ఉన్నారు. ఎక్కువగా హనుమకొండ జిల్లాకు 354, రంగారెడ్డి జిల్లాకు 332 , కరీంనగర్ జిల్లాకు 329 అప్లికేషన్లు రాగా.. తక్కువగా సూర్యాపేట జిల్లాకు 57, సంగారెడ్డి జిల్లాకు 77, ఆదిలాబాద్ జిల్లాకు 82 వచ్చాయి.

కుటుంబానికి దూరం చేసిన్రు
నేను మంచిర్యాల జిల్లా చెన్నూర్​ గర్ల్స్​ హైస్కూల్​లో టీచర్​ని. కేడర్​ బదిలీల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరికి కేటాయించారు. గతంలో స్పౌజ్​ కేటగిరీలో కరీంనగర్​ జిల్లా నుంచి వచ్చిన. మళ్లా అన్యాయం జరిగింది. నా భర్త పురుషోత్తం వేమనపల్లి మండలం చామనపల్లి స్కూల్​లో టీచర్​. మేము చెన్నూర్​లో ఉంటున్నం. మా ఇద్దరు అమ్మాయిలు చిన్నోళ్లు. అత్తమామ కూడా మాతోనే ఉంటరు. నేను, మా ఆయన వేరే వేరే జిల్లాల పనిచేస్తే.. మా పిల్లలను, మా అత్తమామను ఎవరు చూస్కుంటరు? - ఆర్.సుష్మ, స్కూల్​ అసిస్టెంట్