స్కూళ్ల రీ ఓపెన్ .. డైలమాలో స్టూడెంట్స్, పేరెంట్స్

స్కూళ్లు మళ్లీ షురూ అవుతున్నయ్. ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 క్లాసులు మొదలవుతున్నయ్. కరోనా వల్ల దాదాపు సంవత్సరం పాటు  స్కూళ్లు బంద్ కావడంతో వాటిని క్లీన్ చేసే పనిలో పడ్డాయి యాజమాన్యాలు. మరో వైపు, పిల్లల్ని స్కూళ్లకు పంపాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నారు పేరెంట్స్. ‘ఆన్‌లైన్ క్లాసెస్ కంటే కొన్ని రోజులైనా స్కూళ్లకు వెళ్లి చదవడం బెస్ట్’ అని కొంతమంది స్టూడెంట్స్ అంటుంటే, మరికొంతమంది స్కూళ్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. స్కూళ్ల రీ ఓపెన్‌పై టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయంటే..

పిల్లలకు గైడెన్స్ ఉండాలి

మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఆన్ లైన్ క్లాసెస్‌‌తో అంతగా ఉపయోగం ఉండటం లేదు. స్కూలుకు వెళితేనే పిల్లలు షార్ప్‌‌గా ఉంటారు. సబ్జెక్టులు క్లారిటీగా అర్థమవుతాయి. మేమిద్దరం వర్కింగ్. దానివల్ల ఆన్‌‌లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారో చూడలేకపోతున్నాం. కానీ కచ్చితంగా టీచర్ల గైడెన్స్ ఉండాలి. అందుకే నేను మా బాబును స్కూలుకు పంపాలనుకుంటున్నాను. చేతులు తరచూ క్లీన్ చేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని జాగ్రత్తలు చెప్పి పంపిస్తా.

సాజిదా, బిజినెస్ ఉమెన్, హైదరాబాద్

మ్యాండేటరీ అంటే ఆలోచిస్తా..

నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. వ్యాక్సిన్ కూడా ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ టైంలో పిల్లల్ని స్కూళ్లకు పంపడమనేది ఎంత వరకు కరెక్టో నాకు తెలియడంలేదు. ఇప్పటికిప్పుడు పిల్లల్ని స్కూళ్లకు పంపడమంటే చాలా రకాల  ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రాన్స్‌‌పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. కొత్తగా యూనిఫామ్‌‌లు కొనాలి.  ఎంత కాదన్నా పిల్లలు బయటకు వెళ్లిన తర్వాత ఎక్కువ కేర్ తీసుకోరు. ఇవన్నీ ఆలోచించి మా అమ్మాయిని స్కూలుకు పంపకూడదని డిసైడ్ చేసుకున్నా. ఒకవేళ మ్యాండేటరీ అంటే అప్పుడు ఆలోచిస్తా. ఆన్​లైన్​ క్లాసెస్​ కూడా బాగానే ఉన్నాయి.

బాలరాజు, బ్యాంక్ ఉద్యోగి, హైదరాబాద్

చదువుపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది

మా పాప టెన్త్ క్లాస్ చదువుతోంది. ప్రస్తుతం ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌ను బాగా ఫాలో అవుతోంది. ఎగ్జామ్స్‌‌కి కూడా ప్రిపేర్ అవుతోంది. అందుకే ఇప్పుడు ఆమెను  కదపాలనుకోవడంలేదు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో ఈ మార్పులు చదువుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందుకే ఇంట్లోనే ఉంచుతా. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొంత క్లారిటీ వస్తుంది. పంపించాలో లేదో అప్పుడు ఆలోచిస్తా.

రమ్య పొన్నంగి, ఆర్జే, హైదరాబాద్

కరోనా భయం పోలేదు

ఆన్ లైన్ క్లాసెస్ కంటే స్కూలుకు వెళితేనే బాగుంటుంది. టీచర్స్ చెబుతుంటేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్‌‌ కూడా ఉంటారు. కానీ, కరోనా భయం ఇంకా పోలేదు కదా. అందుకే స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది. అమ్మానాన్నలు కూడా వద్దనే చెబుతున్నారు. అందుకే స్కూలుకు వెళ్లకుండా ఆన్ లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాను.

సాయి రోషిణి, 9వ తరగతి, జాన్సన్ గ్రామర్ స్కూల్, హైదరాబాద్

ఎప్పుడు వెళ్తానా అని ఉంది..

స్కూల్ స్టార్ట్ అవుతుందంటే యాంగ్జైటీగా ఉంది. ఎప్పుడెప్పుడు స్కూలుకు వెళ్తానా  అని ఎదురు చూస్తున్నా. జాగ్రత్తలు తీసుకుంటూనే క్లాసెస్ అటెండ్ అవుతా. ఫ్రెండ్స్ అందరినీ బాగా మిస్ అయ్యా. ఆన్‌‌లైన్ క్లాసెస్ కన్నా టీచర్ డైరెక్ట్‌‌గా చెబితేనే బాగా అర్థమవుతుంది. అందుకే స్కూల్ మొదలైతే రెగ్యులర్‌‌‌‌గా వెళతా.

షేక్ అబ్ధుల్ కామ్రాన్, 10వ తరగతి,రఘునాధ మోడల్ హైస్కూల్, చైతన్య పురి

అమ్మ టెన్షన్ పడుతోంది

స్కూలుకు వెళతానో, లేదో నాకు ఇంకా తెలియడం లేదు. నేను స్కూలుకు వెళతాను అంటే మా అమ్మ చాలా టెన్షన్ పడుతోంది. ఎంత కేర్ తీసుకున్నా కరోనా వస్తుందేమో అని ఆమె భయపడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌ అయితే అటెండ్ అవుతున్నాను.

చేతన్, 10వ తరగతి, సెయింట్ ఆన్స్ హై స్కూల్, మదీనా గూడ

ఇంట్లోనే ప్రిపేర్ అవుతా

నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను. టీచర్స్ ఆన్ లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అవే ప్రిపేర్ అవుతున్నాను. స్కూల్‌‌కి వెళితే ఇంకొంచెం బెటర్‌‌‌‌గా ప్రిపేర్ అవ్వొచ్చు. కానీ కరోనా భయం ఎక్కువగా ఉంది. అందుకే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతా.

శ్రీ వినూత్న, 10వ తరగతి,కేంద్రీయ విద్యాలయ, హైదరాబాద్

స్కూలుకు రాని వాళ్లకు ఆన్‌‌లైన్ క్లాసెస్

స్కూళ్లు మూసి కొన్ని నెలలు అయింది. అందుకే ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయిస్తున్నా. బాత్రూంలు కట్టిస్తున్నా. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ఒక పెద్ద బోర్డుపై రాసి స్కూల్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. అక్కడక్కడ శానిటైజర్ స్టాండ్స్ కూడా ఎరేంజ్ చేస్తా. ఫస్ట్ డే అందరికీ జాగ్రత్తలు చెబుతా. లంచ్ టైంలో, బాత్రూంలకు వెళ్లినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో పిల్లలకి చెబుతా. ప్రతి పేరెంట్ నుంచి హామీ పత్రం తీసుకుంటున్నాం. జాగ్రత్తలతో పిల్లల్ని స్కూలుకు పంపాలని చెబుతున్నాం. స్కూల్‌‌కు రావడానికి భయపడే పిల్లలు ఆన్ లైన్ క్లాసెస్‌‌కు అటెండ్ కావొచ్చు.

పి లక్ష్మయ్య , గవర్నమెంట్ హెడ్ మాస్టర్, బాయ్స్ హై స్కూల్, శంకరపల్లి

ఫిజికల్ డిస్టెన్స్ ఓ ఛాలెంజే

స్కూల్‌‌లో శానిటైజేషన్ చేయడం మొదలుపెట్టాం. టాయిలెట్స్, క్లాస్ రూమ్‌‌లు క్లీన్ చేయిస్తున్నాం. జాగ్రత్తలు కూడా బాగా తీసుకుంటాం. కానీ, క్లాస్ రూమ్స్‌‌లో ఫిజికల్ డిస్టెన్స్ ఎంతవరకు మెయిన్‌‌టెయిన్ చేయగలమనేది డౌట్‌‌గా ఉంది. ఎందుకంటే ఒక క్లాస్‌‌లో 40 నుంచి 45 మంది స్ట్రెంత్ ఉంటారు. అయితే ఆరు అడుగులు దూరం మెయిన్‌‌టెయిన్  చేయాలని గైడ్‌‌లైన్స్ ఉన్నాయి. కానీ ఆరు అడుగుల గ్యాప్ ఇచ్చి పిల్లల్ని కూర్చోబెడితే ఎంత మంది క్లాస్ రూమ్‌‌లో పడతారు? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌ కంటే స్కూలుకు వచ్చి చదివితేనే మంచిది. సబ్జెక్ట్స్ అర్థం అవుతాయి. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమంది పిల్లలు వస్తారో చూడాలి.

సాయిబాబా కూచి,తెలుగు పండిట్, చైతన్యపురి

Latest Updates