టీం ఇండియా సూపర్‌ఫ్యాన్ కన్నుమూత

టీం ఇండియా క్రికెట్ సూపర్‌ఫ్యాన్, 87 ఏళ్ల చారులతా పటేల్ కన్నుమూశారు. 2019 వరల్డ్‌కప్‌ సమయంలో ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టును ఉత్సాహపరుస్తున్న చారులత పటేల్‌ని కోహ్లీ కలిశాడు. ఆ తర్వాత ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అప్పటినుంచి ఆమె టీం ఇండియాకి సూపర్ ఫ్యాన్‌గా మారింది. ఆమె మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘టీమిండియా యొక్క సూపర్‌ఫ్యాన్ చారులతా పటేల్ ఎల్లప్పుడూ మన హృదయాల్లోనే ఉంటారు. ఆట పట్ల ఆమెకున్న అభిరుచి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

పటేల్‌ను కలిసిన తరువాత విరాట్ కోహ్లీ ఆమె కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రియమైన చారులతా జీ.. మా జట్టు పట్ల మీకున్న ప్రేమ మరియు అభిమానాన్ని చూడటం చాలా స్ఫూర్తిదాయకం. మీరు మీ కుటుంబంతో కలిసి మరిన్ని ఆటలను చూసి ఆనందిస్తారని నమ్ముతున్నాను. పటేల్ జీకి ఇప్పుడు 87 ఏళ్లు. ఈ వయసులో కూడా మీరు క్రికెట్ పట్ల, మా పట్ల చూపిస్తున్న అభిమానం, ప్రేమ, మద్ధతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. కానీ, క్రికెట్ పట్ల మీకున్న అభిరుచి మీ వయసును కనబడనీయదు’ అని కోహ్లీ ట్వీట్ చేశారు.

అనేక దశాబ్దాలుగా తాను క్రికెట్ చూస్తున్నానని, భారత్ 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలిసారిగా ప్రపంచ కప్ గెలిచినప్పుడు తాను కూడా ఆ స్టేడియంలో ఉన్నానని చారులత ఒక ఇంటర్వ్యులో తెలిపారు.

Latest Updates