రెండేళ్లలో టీమిండియాలోకి..

హైదరాబాద్‌‌, వెలుగు: అద్భుతమైన ఆటగాళ్లతో హాట్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగి, అదిరిపోయే ఆటతో ఫైనల్‌‌కు దూసుకెళ్లిన టీమిండియా అండర్‌‌‌‌-19 వరల్డ్‌‌కప్‌‌లో చివరి మెట్టుపై బోల్తా కొట్టింది!  ఐదో టైటిల్‌‌తో మరింత ఎత్తుకు దూసుకెళ్తుందనుకున్న మన యువసైన్యం.. ఆఖరాటలో నిరాశ పరిచి అభిమానుల్ని నిరుత్సాహపరిచింది..!  ఈ ఫలితంతో తాను కూడా బాధ పడుతున్నప్పటికీ టోర్నీ ఆసాంతం అద్భుతంగా పోరాడామన్న సంతృప్తి ఉందని  ఇండియా టీమ్‌‌ మెంబర్‌‌, హైదరాబాదీ ఠాకూర్‌‌ తిలక్‌‌ వర్మ అంటున్నాడు.   ఫైనల్లో మరో 30 రన్స్‌‌ చేసి ఉంటే కచ్చితంగా కప్పుతోనే తిరిగొచ్చే వాళ్లమని చెబుతున్నాడు.  బ్యాట్స్‌‌మెన్‌‌ వైఫల్యం.. బౌలర్లు లయ తప్పడం వల్లే  ఓటమి ఎదురైందని చెప్పాడు.  తన కెరీర్‌‌లో ఈ టోర్నీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని,  మరో రెండేళ్లలో సీనియర్‌‌ టీమ్‌‌లోకి వస్తానని కాన్ఫిడెంట్​గా ఉన్నాడు.  సౌతాఫ్రికా నుంచి బుధవారం హైదరాబాద్‌‌ చేరుకున్న తిలక్‌‌తో  ‘వెలుగు’ ఇంటర్వ్యూ..

వరల్డ్‌‌కప్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ ఎలా ఉంది?

ఇది నా కెరీర్‌‌లో అతి పెద్ద సందర్భం. సౌతాఫ్రికా వికెట్లపై ఆట.. సీనియర్‌‌ కోచ్‌‌ల సమక్షంలో ట్రైనింగ్‌‌.. భారీ సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్‌‌ సమక్షంలో మ్యాచ్‌‌లు.. మొత్తంగా అద్భుతమైన అనుభవం ఇది. టోర్నీకి ఇండియా నుంచి ఫ్యాన్స్‌‌ వస్తారని తెలుసు. కానీ, అంత పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఊహించలేదు. ఒకరకంగా ఇండియాలో ఆడినట్టే అనిపించింది. టోర్నీతో చాలా విషయాలు నేర్చుకున్నా.

కప్‌‌ నెగ్గనందుకు బాధపడుతున్నారా?

బాధ కచ్చితంగా ఉంటుంది. కాకపోతే  ఫైనల్లో మేం హండ్రెడ్‌‌ పర్సెంట్‌‌ ఎఫర్ట్‌‌ పెట్టి ఆడాం. కప్‌‌ నెగ్గేందుకు మా శక్తి మేరకు పోరాడాం. చాలా క్లోజ్‌‌ మ్యాచ్‌‌లో ఓడిపోయాం. అయితే మా పెర్ఫామెన్స్‌‌ పట్ల సంతృప్తిగానే ఉన్నాం. గెలిచి ఉంటే ఇంకా బాగుండేది. కానీ, ఏదైనా గ్రౌండ్‌‌లో ఉన్నప్పుడే మన చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి బయటికి వస్తే ఇక అంతే. మ్యాచ్‌‌ ముగిసిన తర్వాత మా కోచ్‌‌లు, కెప్టెన్‌‌ కూడా అదే చెప్పారు. గ్రౌండ్‌‌లో మేం బాగా పోరాడామన్నారు. కాబట్టి  ఏదో కోల్పోయామని ఫీల్‌‌ కాకూడదని చెప్పారు.  ఆ రోజు మాది కాకుండా పోయింది అంతే.

ఓటమికి కారణాలు ఏమిటో అన్వేషించారా?

ఫైనల్​ మ్యాచ్​ రోజు మా బౌలర్లు రిథమ్‌‌లో లేకపోవడమే ముఖ్య కారణం. అయితే వాళ్లపై మేం అతిగా ఆధారపడలేదు. మా బ్యాటింగ్‌‌ కూడా అంత బాగా లేదు. మరో ముప్పై రన్స్‌‌ చేయాల్సింది. 220–230 రన్స్‌‌ మంచి స్కోరు అయి ఉండేది. అయితే, ఆసియా కప్‌‌లో కూడా లో స్కోరు చేసినా ప్రత్యర్థిని వందలోపు ఆలౌట్‌‌ చేశాం కాబట్టి 177 రన్స్‌‌ టార్గెట్‌‌ను కాపాడుకోగలమని అనుకున్నాం. బంగ్లాను ఆలౌట్‌‌ చేయగలమని, కప్పు నెగ్గగలమన్న కాన్ఫిడెన్స్‌‌తోనే ఉన్నాం. పైగా, టోర్నీలో మా బౌలర్లు అద్భుతంగా పెర్ఫామ్​  చేశారు. సెమీస్‌‌ వరకు జరిగిన ఐదు మ్యాచ్‌‌ల్లోనూ ప్రత్యర్థులను ఆలౌట్ చేశారు. అయితే, ఫైనల్లో మేం ఊహించినట్టు జరగలేదు.

ఫైనల్లో మీరు ఔటైన తర్వాత..

వరుసగా వికెట్లు పడ్డాయి.  మ్యాచ్‌‌లో అదే టర్నింగ్‌‌ పాయింట్‌‌ అనుకోవచ్చా?

స్టార్టింగ్‌‌లోనే వికెట్ పడ్డ తర్వాత జైస్వాల్‌‌, నేను ఇన్నింగ్స్‌‌ బాధ్యత తీసుకున్నాం. సెకండ్‌‌ వికెట్‌‌కు దాదాపు సెంచరీ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేశాం. దురదృష్టవశాత్తు నేను ఔటైన తర్వాత రిథమ్‌‌ దెబ్బతిన్నది. అయితే నేనేమి చెత్త షాట్‌‌ ఆడలేదు. పవర్‌‌ ప్లేలో తక్కువ రన్స్‌‌ రావడంతో వేగం పెంచాలనుకున్నా. ఆ సిచ్యువేషన్‌‌కు తగ్గట్టుగానే షాట్‌‌ కొట్టా. కానీ, ఫీల్డర్‌‌ మంచి క్యాచ్‌‌ అందుకున్నాడు. అయినా కెప్టెన్​ ప్రియమ్‌‌తో పాటు చాలా మంది బ్యాట్స్‌‌మెన్‌‌ ఉండడంతో ఇబ్బందేం లేదనుకున్నా. కానీ, వరుసగా వికెట్లు పడడంతో తక్కువ స్కోరుకే ఆలౌటయ్యాం. నేను ఇంకాసేపు క్రీజులో ఉండి మంచి స్కోరు చేస్తే మేం గెలిచే వాళ్లమేమో?

టోర్నీలో మూడు మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్‌‌ చేసే చాన్స్‌‌ రాలేదు. అసంతృప్తి ఉందా?

అస్సలు లేదు. ఇండియాకు ఆడుతున్నప్పుడు జట్టు గెలిస్తే చాలు. ఇంకేమీ వద్దనుంటా. వరల్డ్‌‌కప్‌‌ ముందు జరిగిన ట్రై సిరీస్‌‌లో ఇండియా నుంచి టాప్‌‌ స్కోరర్‌‌ కావడంతో సహజంగానే జట్టు నాపై అంచనాలు ఉంచింది. పైగా, ఎంతో కీలకమైన వన్‌‌డౌన్‌‌లో ఆడే చాన్స్‌‌ ఇచ్చింది. మూడు ఇన్నింగ్స్‌‌లు ఆడితే ఒక్కసారి మాత్రమే ఫెయిలయ్యా. రెండుసార్లు పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బిల్డ్‌‌ చేసి నా కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించానని అనుకుంటున్నా. కాకపోతే  టోర్నీలో సెంచరీ చేయాలనుకున్నా. అది సాధ్యం కాలేదు.

మీ తర్వాతి టార్గెట్‌‌?

అండర్‌‌–19కు టాప్ లెవెల్‌‌ అయిన ఈ వరల్డ్‌‌కప్‌‌కు నా లైఫ్‌‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ఇక్కడితో నా ప్రయాణం ముగియదు. ఫ్యూచర్‌‌ క్రికెట్‌‌ చాలా ఉంది. ఇకపై డొమిస్టిక్‌‌ క్రికెట్‌‌పై ఫోకస్‌‌ ఉంచుతా. వచ్చే సీజన్‌‌ రంజీ ట్రోఫీలో బాగా ఆడి ఇండియా-–ఎ టీమ్‌‌లోకి రావాలనుకుంటున్నా. అక్కడి నుంచి రెండేళ్లలో నేషనల్‌‌ సీనియర్‌‌ టీమ్‌‌లో ప్లేస్‌‌ సాధించాలి. వచ్చే వన్డే వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా తరఫున ఆడాలన్నది నా టార్గెట్‌‌.

వాళ్లందరినీ మిస్‌‌ అవుతున్నా

వరల్డ్​కప్​ కోసం ఒకటిన్నరేళ్ల ముందు నుంచే మా ప్రిపరేషన్స్‌‌ మొదలయ్యాయి. జట్టుకు ఎంపికైన 15 మందితో పాటు మరో 16–17 మంది ప్రాబబుల్స్‌‌తో కలిసి దాదాపు 50–60 మ్యాచ్‌‌లు ఆడాం. ఈ టోర్నీకి నెల రోజుల ముందే సౌతాఫ్రికా వెళ్లాం. టీమ్‌‌లో మంచి వాతావరణం ఉండేది. అంతా ఫ్యామిలీ మెంబర్స్‌‌లా కలిసిపోయాం. ఒకేసారి తినేవాళ్లం. ఇప్పుడు వాళ్లందరినీ మిస్‌‌ అవుతున్నా. కోచ్‌‌లు పరాస్‌‌ సార్‌‌, రిషీ సార్ కూడా మాతో ఫ్రెండ్స్‌‌లా ఉన్నారు. మా పెర్ఫామెన్స్‌‌ పడిపోయినా.. మైండ్‌‌సెట్‌‌ బాగాలేకపోయినా మంచి సపోర్ట్‌‌ ఇచ్చేవారు. ఏ టైమ్‌‌లో ఎలాంటి డౌట్స్‌‌ అడిగినా ఓపిగ్గా సలహాలు ఇచ్చేవారు. టోర్నీకి ముందు నెల రోజుల పాటు రాహుల్‌‌ ద్రవిడ్‌‌ సార్‌‌ కూడా మాతో ఉన్నారు. మంచి గైడెన్స్‌‌ ఇచ్చారు. టూర్‌‌కు ముందు అజర్‌‌ సర్‌‌ను కూడా కలిశా. సౌతాఫ్రికాలో ఎలా ఆడాలి. బౌన్స్‌‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆయన ఇచ్చిన టిప్స్​ చాలా ఉపయోగపడ్డాయి.

పది నిమిషాల తర్వాత కలిసిపోయాం.. సారీ చెప్పుకున్నాం..

మ్యాచ్‌‌ గెలిచిన తర్వాత జరిగిన గొడవ ఊహించలేదు. గెలిచిన ఉద్వేగంలో బంగ్లా క్రికెటర్లే కాస్త అతిగా ప్రవర్తించారు. మాపై దురుసుగా వ్యవహరించారు. మా వైపు నుంచి ఒకరిద్దరు క్రికెటర్లు కూడా సీరియస్‌‌గా రియాక్ట్ అయ్యారు. దాంతో, సపోర్ట్‌‌ స్టాప్​తో కలిసి అందరినీ అదుపుచేశాం. అయితే, పది నిమిషాల్లోనే సిచ్యువేషన్‌‌ మారింది. ప్రజెంటేషన్‌‌ అయిన తర్వాత గ్రౌండ్‌‌లోనే ఇరుజట్ల ఆటగాళ్లం మళ్లీ కలిశాం. సారీ చెప్పుకున్నాం.

 

Latest Updates