టెక్నాలజీ మహిమ : వ్యవసాయం చేసే రోబో రైతులు

technology-turns-to-robot-farming-agriculture-231877-2

రోబో రైతు

టెక్నాలజీ సహాయంతో దేన్నైనా తయారు చేయొచ్చు. కానీ తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలను మాత్రం కష్టపడి భూమిపై పండించాల్సిందే  అన్నది చాలామంది అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ సీన్ కూడా రివర్స్ అయింది. వ్యవసాయం కూడా రోబోలే చేస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌‌ని  ఉపయోగించి రకరకాల పంటలు  పండిస్తున్నాయి.  అది కూడా నీరు, మట్టి అవసరం లేకుండా… రోబోలతో వ్యవసాయం చేయొచ్చన్న ఐడియా మొదటిసారి అలెగ్జాండర్ అనే ఇంజనీర్‌‌‌‌కు వచ్చింది. అలెగ్జాండర్ క్యాలిఫోర్నియాలోని  ‘మూన్‌‌షాట్’ లేబొరేట‌‌రీ రోబోటిక్స్ విభాగంలో  ఇంజనీరుగా పని చేసేవాడు. డ్రోన్లను తయారు చేయడం అతని వృత్తి. అయితే అక్కడే పనిచేస్తున్న జోన్ బిన్నీతో అలెగ్జాండర్‌‌‌‌కు స్నేహం కుదిరింది. కొన్నాళ్లకు వాళ్లిద్దరూ కలిసి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్లకొచ్చిన ఐడియానే ఈ రోబో ఫామింగ్.

ఎన్నో ఏళ్ల కృషి

వాళ్లిద్దరూ ఎంతో కాలం కృషి చేసి ‘ఐరన్ ఆక్స్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు అలెగ్జాండర్ సీఈవో కాగా,  బిన్నీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐరన్‌‌ ఆక్స్‌‌ పేరుతో  ఎనిమిది వేల చదరపు అడుగుల ప్రాంగణంలో రోబో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసారు. ఇక్కడ ఏర్పాటు చేసిన  గ్రీన్‌‌ హౌజ్‌‌లలో రకరకాల పంటలు, ముఖ్యంగా ఆకు కూరలు, కూరగాయల పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడ విత్తనాలు నాటే దగ్గర నుంచి పంటను దగ్గరుండి చేసుకునే వరకు అన్ని పనులు రోబోలే చేస్తాయి.

మార్కెట్‌‌కి వచ్చాయి.

అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే..  రోబోలు పండించిన కూరగాయలు మార్కెట్‌‌లోకి వచ్చాయి. మొన్నటివరకు అక్కడ పండించే కూరగాయల అమ్మకానికి వ్యాపార సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ ఉండేవికావు. అందుకే పండించిన కూరగాయలను  అమ్మకానికి శాన్‌‌ ఫ్రాన్సిస్కో తీరప్రాంత రెస్టారెంట్లతో అలెగ్జాండర్‌‌ సంప్రదింపులు జరిపాడు. ‘‘ప్రపంచంలో  మొదటిసారి రోబోలు సాగుచేసిన కూరగాయలు తినడానికి సిద్ధమని,  రోబోలు పండించిన ఈ కూరగాయలతో చేసిన సలాడ్ మీరు ఇప్పటి వరకు తిననంత రుచిగా ఉంటుంది’’ అని తన మాటలతో  నోరూరిస్తున్నాడు అలెగ్జాండర్.

ఖర్చు తక్కువే..

అలెగ్జాండర్‌‌ మాట్లాడుతూ ‘‘వచ్చే ఏడాదికల్లా మా రోబో పండించిన కూరగాయలు అన్ని సూపర్‌‌ మార్కెట్లకు చేరతాయి. నీటి అవసరం ఎక్కువగా లేకుండా సహజ సూర్యకాంతిపై ఆధారపడే గ్రీన్‌‌ హౌజ్‌‌లలో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అత్యంత ఖర్చుతో కూడుకున్న హైపవర్‌‌ విద్యుత్ కాంతితో చేసే  ఇండోర్‌‌ సాగుకన్నా ఇది ప్రకృతికి దగ్గరగా తక్కువ ఖర్చవుతుంది’’అని చెప్పాడు.

పక్వానికి వచ్చిన పంట ఉత్పత్తులను మానవ కార్మికశక్తితో సేకరించినా, భారీ మొత్తంలో వాటిని ఒకచోట నుంచి మరో చోటికి రోబోలే సునాయాసంగా తరలిస్తాయట. పేరు పెట్టని ఒక రోబో చిన్న పాదుల్లో కాస్త ఎదిగిన మొక్కలను సున్నితంగా తీసి, పెద్ద పాదుల్లోకి మారుస్తుందట. ఇది ఒకే సారి  సుమారు 250 మొక్కలను పెద్ద పాదుల్లోకి మార్చగలదట. పక్వానికి వచ్చిన పంటను గుర్తించి సేకరించగల రోబోని కూడా త్వరలోనే తయారు చేస్తామని, ఇలా ఇక్కడ ప్రతీ పనికి రోబోలే వాడతామని చెప్పాడు.

‘‘రోబోల సాయంతో మానవాళి ఆకలి తీర్చ గలిగితే ప్రపంచంపై ప్రభావం చూపగల ఘనకార్యం అంతకన్నా మరొకటి ఏముంటుంది?’’ అంటున్నాడతను.

 

Latest Updates