జీవితాలతో చెలగాటమాడుతున్న గేమ్స్

ఓ అపార్డుమెంట్​ సెల్లార్​లోనో, ఓ కాలువ గట్టు మీదో, లేదా ఏదైనా నది ఒడ్డునో… నలుగురు కుర్రాళ్లు వంచిన తల ఎత్తకుండా సెల్​ఫోన్లలో మునిగిపోయి కనిపిస్తే… వాళ్లు కచ్చితంగా వీడియో గేమ్స్​ ఆడుతున్నట్లే! పొద్దున్నే పాల ప్యాకెట్లకైనా కాలు బయటపెట్టనివాళ్లు ఇప్పుడు వీడియో టీమ్​ గేమ్స్​కోసం వెళ్తున్నారు. ఈమధ్య ఇంటి నుంచే టీమ్​ గేమ్​ ఆడుకునేలా కొత్త కొత్త గేమ్స్​ వచ్చాయి. టీమ్​లో ఉన్నవాళ్లంతా ఒకరితో ఒకరు కనెక్ట్​ అవుతూ గేమ్​ ఆడుతుంటారు. ఈ పద్ధతి మనకంటే బయటి దేశాల్లో ఎక్కువగా ఉంది.

చైనాలో ‘గేమ్స్​’ కర్ఫ్యూ

టీనేజిలో 18 ఏళ్లు దాటకుండానే వయొలెన్స్​ ఆటిట్యూడ్​​ పెరగడం, సూసైడల్​ టెండెన్సీతో ప్రాణాలు తీసుకోవడం, మొండితనం, మూర్ఖత్వం, చదువులో వెనకబడడం వగైరా పెరిగిపోయేసరికి చైనా కళ్లు తెరిచింది. ఇప్పుడు వీడియో గేమ్స్​ ఆటపై కర్ఫ్యూ పెట్టింది.

గేమింగ్​పై నెలకు రూ.2,000 ఖర్చు

పేరెంట్స్​ నుంచి వత్తిడి పెరగడంతో కొత్త ఆన్​లైన్​ గేమ్​లపై కంట్రోల్​ పెట్టి; ఆడుకునే సమయంపైనా, ఏజ్​పైనా  కంట్రోల్​ పెట్టాల్సి వచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్​ కమిటీ ఆన్​లైన్​ గేమింగ్​ని సమీక్షించడానికి ఒక ప్యానెల్​ని ఏర్పాటు చేసింది. దీనిలో గేమింగ్​ ఎక్స్​పర్ట్​లు, ప్రభుత్వం నియమించిన రీసెర్చర్లు, మీడియా–వీడియో గేమ్స్​ ఇండస్ట్రీ నుంచి ప్రతినిధులు ఉన్నారు. మొత్తం 20 గేమ్​లను ప్యానెల్​ రివ్యూ చేసి, తొమ్మిదింటిని మార్కెట్​లోకి రాకుండా బ్యాన్​ చేసింది. మిగతా 11 గేమ్​ల్లోకూడా జనాన్ని చెడగొట్టే కంటెంట్​ని తొలగించి విడుదల చేయాలని ఆర్డరేశారంట. ఎనిమిదేళ్లకే ఈ వ్యసనానికి ఎట్రాక్ట్​ అవుతున్నారు. ఎనిమిది నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు నెలకు సుమారుగా 200 యువాన్లు (రూపాయల్లో 2,000 పైచిలుకు), 16 నుంచి 18 ఏళ్లవాళ్లు అంతకు రెట్టింపు డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా చైనా గుర్తించింది. ప్రపంచంలో అతి పెద్ద గేమింగ్​ మార్కెట్ ఉన్న దేశాల్లో చైనా రెండోది.  పోయినేడాదే కొన్ని ఆంక్షలు తేవడంతో అమెరికా నెంబర్​ వన్​ ప్లేస్​కి వచ్చేసింది. టీనేజర్ల కంటిచూపు దెబ్బతినడంకూడా కంట్రోల్​కు ఒక కారణం.

ఇప్పుడంతా టీమ్​ గేమింగే

ఈ గేమింగ్​ ఎడిక్షన్​​ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. గతంలో వచ్చిన బ్లూ వేల్, సినామన్ చాలెంజ్​, ఫైవ్​ ఫింగర్​ ఫిల్లెట్​, సాల్ట్​ అండ్​ ఐస్​ చాలెంజ్​, చార్లీ చార్లీ, డోటా, కాంట్రాస్ట్​ స్ట్రయిక్​ వగైరాలన్నీ టీనేజర్లను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆసియా దేశాల్లో డోటా, కాంట్రాస్ట్​ స్ట్రయిక్​ లాంటివి బాగా ఆడుతుంటారు. ఓ పది మంది వరకు జమయి, రెండు టీమ్​లుగా విడిపోయి, ఒక కామన్​ ఐపీ అడ్రస్​ క్రియేట్​ చేసుకుని ఆడడం ఈ వీడియో గేమ్స్​ ప్రత్యేకత. ఎవరికి వారుగా గేమ్​ డౌన్​లోడ్​ చేసుకుని, ఒంటరిగా ఆడుకునేవి చాలా తక్కువ. టీమ్ గేమ్స్​ కనీసం రెండు గంటలపాటయినా సాగుతాయి.  దీనికోసం సెల్​ ఫోన్​లో పుల్​ చార్జింగ్, డేటా ప్యాకేజీ ఉంటే చాలు. ప్రత్యేకించి డబ్బులు ఏవీ ఖర్చు పెట్టరు. ఇంట్లో నుంచి ఆడేవాళ్లుగానీ, బయట ఫోన్లతో ఆడేవాళ్లుగానే ఇంటర్నెట్ ​ప్యాకేజీకే ఖర్చు చేస్తారు. స్మార్ట్​ ఫోన్ల హవా రావడానికి ముందు పెద్ద నగరాలతోపాటు  మునిసిపాలిటీ లెవెల్​ల్లోనూ వీడియో పార్లర్లు బాగా ఉండేవి. వాటిల్లో ఆడుకోవాలంటే, గంటకు సగటున 40 రూపాయలు ఖర్చయ్యేది. నెలకు యావరేజ్​గా ఒక్కో పిలగాడు 1,500 రూపాయలు ఖర్చుతో గేమింగ్​లో మునిగి తేలేవాళ్లు. కొందరైతే గేమింగ్​ స్టేషన్లలో గంటలు గంటలు గడుపుతూ నెలకు అయిదారు వేల రూపాయలు పాకెట్​ మనీ ఖర్చు చేసేసేవారని చెబుతారు.  ఇప్పుడు డేటా ప్యాకేజీలు చౌకగా మారాయి. ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్​ ఫోన్లు మార్కెట్​లో దొరుకుతున్నాయి. మునుపటిలా వీడియో పార్లర్లకు, గేమింగ్​ స్టేషన్లకు వెళ్లేవాళ్లు తగ్గిపోయారు. ప్రస్తుతం ‘గేమింగ్​ ఫ్రం హోమ్’​ కల్చర్​ సాగుతోంది. పైన చెప్పినట్లుగా ఒక కామన్​ ఐపీ క్రియేట్​ చేసుకుని, టీమ్​ గేమ్​ ఆడుతున్నారు. అయితే, త్రీడీ ఎఫెక్ట్​ కోరుకునేవాళ్లుమాత్రం ఇప్పటికీ గేమింగ్​ స్టేషన్లకే వెళ్తుంటారు. ఈ వ్యసనాన్ని వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ ‘ఆన్​లైన్​ గేమింగ్​ డిజార్డర్​’గా పేర్కొంది. మెంటల్​ హెల్త్​ కండిషన్​ని దెబ్బ తీస్తోందని చాలా సీరియస్​గా స్పందించింది. ఇప్పటికే చాలా దేశాల్లో వీడియో గేమింగ్​ ఎడిక్షన్​ నుంచి టీనేజర్లను తప్పించడానికి ప్రైవేటు క్లినిక్​లు ఏర్పడ్డాయంటే… సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.   ​

ఏజ్​ని బట్టి గేమింగ్​

వీడియో గేమింగ్​లో టాప్​ పొజిషన్​లో ఉన్న కంపెనీ టెన్సెంట్. ఇది చైనాలోనే ఉంది. మొదట్లో ఇంటర్​​నెట్ సర్వీసులతో మొదలెట్టి… క్రమంగా ఎంటర్​టైన్​మెంట్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, వీడియో గేమింగ్​ రంగాల్లో దూసుకెళ్లింది. షెంజెన్​ సిటీలోగల ఈ కంపెనీ వీడియో గేమ్స్​లోకి ఆరేళ్ల క్రితమే ప్రవేశించింది. చైనీస్​ పురాణ కథలతో టూడీ ఆన్​లైన్​ గేమ్​ని ఫస్ట్​ రూపొందించింది. ఆ తర్వాత జుంగ్జియాన్​ పేరుతో త్రీడీ గేమ్​ని తయారు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి ‘పేట్రియాటిక్​ గేమ్స్​’ని కూడా టెన్సెంట్​ రూపొందించింది. ఇప్పుడీ కంపెనీకికూడా సెగ తగిలింది. చైనాలోనే తల్లిదండ్రుల నుంచి విపరీతంగా విమర్శలు రావడంతో ‘కర్ఫ్యూ’ పేరుతో కొన్ని కంట్రోల్స్​ అమల్లోకి తెచ్చింది.

దారుణాల పబ్ జీ

కిందటేడాది మార్కెట్లోకి వచ్చిన పబ్ జీ వీడియో గేమ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది మిలటరీ స్టయిల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. వందమంది ప్లేయర్లు  బ్యాటిల్ గ్రౌండ్ లోకి దిగి యుద్ధం చేసుకోవడమే ఈ వీడియో గేమ్. యుద్దంలో చివరకు ఎవరు మిగులుతారో వాళ్లే  విజేతలుగా నిలుస్తారు. ఒకసారి పబ్ జీ గేమ్ వాడిన వాళ్లు దీనికి అడిక్ట్ అయిపోతారన్న  ప్రచారం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లో కేవలం నాలుగు నెలల కాలంలో పది కోట్ల డౌన్ లోడ్లతో  పబ్ జీ గేమ్ రికార్డు నమోదు చేసింది. ఈ ఆట ఆడుతూ మనదేశంలో చాలా మంది చనిపోయారు. ఫోన్ చూస్తూ ఆట ఆడుతున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోరు. అలా అనేక మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. తిండీతిప్పలు లేకుండా నాన్ స్టాప్ గా పబ్ జీ ఆడి ఆస్పత్రి పాలైన వాళ్లు కోకొల్లలుగా ఉన్నారు.

మన దగ్గరా వేల కోట్ల  ఇండస్ట్రీనే

1970ల వరకు వీడియో గేమ్స్ కేవలం ఎంటర్ టైన్ మెంట్ గానే ఉండేవి. అయితే ఆ తరువాత  వీడియో గేమ్స్ ఆడటమనేది ఓ ఇండస్ట్రీగా మారిపోయింది. కంప్యూటర్ ఆటలు కమర్షియల్ గా మారాయి. హాలీవుడ్ సిన్మాల వసూళ్ల కంటే వీడియో గేమ్స్ ఇండస్ట్రీ  రాబడే ఈమధ్య కాలంలో పెరిగిందంటున్నారు  నిపుణులు.  మనదేశంలో కూడా వీడియో గేమ్స్ ఇండస్ట్రీ  హల్ చల్ చేస్తోంది. వేల కోట్ల రూపాయల మార్కెట్ చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా  కంప్యూటర్ గేమింగ్ లో ఇండియా ఐదో ప్లేస్ లో ఉందని 2016 నాటి ఒక రిపోర్టు వెల్లడించింది. ‘ఫ్రీ టు ప్లే ’ ( ఎఫ్ 2 పీ) అనే డివైస్ మార్కెట్ లోకి రావడంతో బిజినెస్ పుంజుకుందంటున్నారు నిపుణులు. అంతేకాదు గతంలో ఇండియన్ గేమర్స్ దగ్గర సరిపడ డబ్బుల్లేకపోవడంతో  ఈ ఇండస్ట్రీ నెమ్మదిగా ఉండేది. అయితే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో మనదేశంలో వీడియో గేమ్స్  బిజినెస్ పుంజుకుంది.

బ్లూ వేల్​ భూతం మరెన్నో దెయ్యాలు

ఆన్​లైన్​ గేమ్​ అనగానే ‘బ్లూ వేల్​’ గుర్తొచ్చి భయంతో వణికిపోతారు పేరెంట్స్​. ఎందుకంటే, ఇది గేమ్​ క్రియేటర్​ ఆడిస్తున్నట్లల్లా ఆడుతూ చివరకు ప్రాణాలు తీసుకోవడానికి దారి తీసే ప్రమాదకరమైన ఆట. ఈ గేమ్​లోకి ఎంటరైన టీనేజర్లకు కొన్ని చాలెంజ్​లు ఇస్తారు. ఇవన్నీ 50 రోజుల్లో పూర్తి చేయాలి. వాటిని సాల్వ్​ చేసుకుంటూ పోవడంలో మజా పొందుతూ సూసైడల్​ టెండెన్సీకి గురవుతారు.  ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా రష్యాలో వందలాది మంది టీనేజర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.  ఈ గేమ్​ క్రియేటర్​ రష్యన్​ ఫిలిప్​ బుదేయికిన్​ వయసు అంతా చేసి 21 ఏళ్లు.  ఇతను ఇచ్చిన టాస్క్​లతో 16 మంది టీనేజ్​ అమ్మాయిలు సూసైడ్​ చేసుకున్నట్లు తేలడంతో అరెస్ట్​ చేశారు.

బ్లూ వేల్​ గేమ్​ లాంటి ప్రమాదమైన వీడియో గేమ్స్​ ఇంకా చాలా ఉన్నాయి.సినామన్​ చాలెంజ్​ : దాల్చిన చెక్కని బాగా పొడిగా చేసుకుని, చెంచాడు పొడిని నిమిషంపాటు చప్పరించాలి. మధ్యలో నీళ్లు తాగకూడదు. దాల్చిన చెక్క చాలా ఘాటైనది. ఇది నోరు పొడిబారేటట్టు చేస్తుంది. మింగాలని చూస్తే గొంతు మండిపోతుంది.  ఊపిరాడదు. నిమిషంపాటు నరకయాతన అనుభవిస్తారు.  అమెరికాలోని పాయిజన్​ సెంటర్లకు అనేకమంది బాధితులు వెళ్లాల్సి వచ్చింది.

గ్యాలన్​ చాలెంజ్​ : దీనిలో ఆడేవాళ్లకు టైమ్​ ఫిక్స్​ చేసి, ఆలోపులో గ్యాలన్​ (3.8 లీటర్లు) పాలు తాగాలి. తక్కువ టైమ్​లో అన్ని లీటర్లు తాగడంవల్ల బాడీలో హైడ్రేషన్​ పెరిగిపోయి, కణాలు దెబ్బతింటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు

మరియం గేమ్​ : ఈ ఆన్​లైన్​ గేమ్​లో ఒక చిన్నమ్మాయి అడవిలో తప్పిపోతే ఇంటికి తీసుకురావాలనే టార్గెట్​ ఇస్తారు. గేమ్​ మొత్తం దయ్యాల శబ్దాలు, భయంకరమైన ఆడియోతో సాగుతుంది.              .

ఫైవ్​ ఫింగర్​ ఫిల్లెట్​ : ఇది కూడా ప్రమాదకరమైనదే. ఒక టేబుల్​పై అరచేతిని ఉంచి, అయిదు వేళ్లనూ విడదీయాలి. ఆ వేళ్ల మధ్యన చాకుతో పొడుస్తూ వెళ్లాలి. ఏమాత్రం కంట్రోల్​ తప్పినా వేళ్లు తెగిపోతాయి

సాల్ట్​ అండ్​ ఐస్​ చాలెంజ్​ : ఈ గేమ్​ ఆడేవాళ్లు తమ అరచేతిలో ఉప్పు వేసుకుని, దానిపైన ఐస్​ క్యూబ్​ పెట్టుకోవాలి. దీంతో చేయంతా మండిపోతున్న ఫీలింగ్​ కలుగుతుంది. ఉప్పు–ఐస్​ కాంబినేషన్​ వల్ల మైనస్​ 18 డిగ్రీలకు టెంపరేచర్​ పడిపోతుంది. వేగంగా మంచు తినేయడంతో అరచేయి చచ్చుబడే ప్రమాదం ఉంది.

ఇంకా ఎన్నో ఉన్నా… వాటిని ఇక్కడ ఇవ్వలేనంత భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి గేమ్స్​ యూత్​ని చెడగొట్టడమే కాదు. మెల్లమెల్లగా సర్వనాశనం చేస్తున్నాయి.

 

Latest Updates