ప్రియుడి తమ్ముడు కొట్టాడని.. 17ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య

ముంబై: కాలేజీ దగ్గర పట్టుకుని పది మందిలో ప్రియుడి తమ్ముడు కొట్టి అవమానించాడని మనస్తాపంతో ఓ అమ్మాయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జరిగింది.

హింగ్నా ప్రాంతానికి చెందిన ఆకాశ్, అదే ఊరికి చెందిన ఓ 17ఏళ్ల అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. వారి వ్యవహారం రెండు కుటుంబాలకూ ఇష్టం లేదు. దీంతో ఆకాశ్ తమ్ముడు ప్రకాశ్ మంగళవారం ఆ అమ్మాయి చదివే కాలేజీ దగ్గరకు వెళ్లి పది మందిలో అవమానించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. నోటికి వచ్చినట్లు తిట్టి.. తన అన్నతో ప్రేమ మానుకోవాలని హెచ్చరించాడు. ఈ గొడవ విషయం ఆ అమ్మాయి తల్లికి తెలిసి.. కాలేజీకి వెళ్లి తనను ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను తండ్రి కూడా మందలించాడు. ప్రేమ వ్యవహారాలు పక్కనపెట్టి శ్రద్ధగా చదువుకొని డిగ్రీ పూర్తి చేయాలని సూచించాడు.

అయితే కాలేజీ దగ్గర జరిగిన అవమానంతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఊరిలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కేసు పెట్టి, చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Updates