ఇరవైవేలకు తన ఇద్దరు మనవరాళ్లను బ్రోకర్ కి అమ్మేసింది

ఆర్ధిక పరిస్థితులు కారణంగా ఓ బామ్మ తన ఇద్దరి మనవరాళ్లను ఒక బ్రోకర్ కు అమ్మేసింది. తండ్రి దినసరి కూలీ కావడం, తల్లి మానసిక రోగంతో బాధపడుతున్నందున కుటుంబ పోషణ కోసమని ఒక్కొక్కర్ని రూ.10 వేల చొప్పున రూ.20,000 లకు విక్రయించింది. తమిళనాడులోని తిరువరూర్ జిల్లా పురవాసం లో జరిగిందీ ఘటన.  ఓ చైల్డ్ లైన్ సెంటర్ వారు ఇచ్చిన సమాచారంతో తిరువరూర్ జిల్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ ఎం దురై చెప్పిన వివరాల ప్రకారం… “ 14, 13 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు వారి తల్లిదండ్రులు, అమ్మమ్మలతో కలసి నివసించేవారు. తండ్రి రోజువారీ కూలీ. తల్లి మానసిక రోగంతో బాధపడుతోంది. వారి పేదరికం నుంచి గట్టెక్కించడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం వారి  అమ్మమ్మ (విజయలక్ష్మి)..  ఇద్దరు మనవరాళ్లను ఓ బ్రోకర్ కి అమ్మింది. వాళ్లిదర్నీ ఓ ఫ్యాక్టరీలో పనిలో పెడుతున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పింది.  మూడు రోజుల క్రితం చైల్డ్‌లైన్ సెంటర్ నుండి వచ్చిన సమాచారంతో.. వారి కుటుంబాన్ని ప్రశ్నించగా అందుకు వారు వారు సహకరించలేదు” అని ఎస్పీ చెప్పారు.

ఆ ఫ్యాక్టరీ గురించి తెలుసుకొని..  ఫ్యాక్టరీ ఓనర్ ని ప్రశ్నించామని, తాము చెప్పిన ఆధారాలతో  ఏ బాలికనూ పనిలోకి తీసుకోలేదని అతడు చెప్పాడన్నారు ఎస్పీ.  తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, రేపు (శనివారం) ఉదయం లోగా బాలికల ఆచూకీ కనుగొంటామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం.. పోలీసులు బాలికల అమ్మమ్మపై బాలల కార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను స్థానిక పోలీసు స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాలికలు తిరువరూర్ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Latest Updates