టీనేజర్ల తాగుడు తగ్గింది

ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ట్రెండ్

ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న మిలీనియల్స్​

ఐఏఆర్​డీ అనే సంస్థ రీసెర్చ్​.. ఇండియా బెటర్​ అని కామెంట్​

డెన్మార్క్​లో ఎక్కువ తాగేస్తున్న మిలీనియల్స్​

నేటి తరం పిల్లలు బాగా చెడిపోతున్నారంటూ చాలా మంది తెగ బాధపడిపోతుంటారు. ఇంత చిన్న వయసుల్లోనే మందు తాగుతున్నారంటూ ఆందోళన చెందుతుంటారు. నిజమే, చిన్న వయసులోనే పిల్లలు దురలవాట్లు చేసుకుంటున్నా, మునుపటితో పోలిస్తే ఆ సంఖ్య బాగా తగ్గిందని అంటున్నారు నిపుణులు. అవును, మందు తాగే మిలీనియల్స్​ (నేటి తరం పిల్లలు) చాలా తగ్గారని ఇంటర్నేషనల్​ అలయన్స్​ ఫర్​ రెస్పాన్సిబుల్​ డ్రింకింగ్​ (ఐఏఆర్​డీ) అనే సంస్థ రీసెర్చ్​ చేసి తేల్చింది. ఇండియా సహా 63 దేశాల్లో నేటి తరం పిల్లల తాగుడు అలవాట్లను పరిశీలించింది. 2000 నుంచి 2015 మధ్య పిల్లల తాగుడు లెక్కను తేల్చింది. కొన్ని దేశాల్లో 2000వ సంవత్సరం నుంచి డేటా లేకపోవడంతో, ఆయా దేశాలకు 2009, 2010, 2011వ సంవత్సరం నుంచి లెక్కించింది. దానికి హెనికెన్​, కార్ల్స్​బర్గ్​ గ్రూప్​, డయాజియో వంటి ఆల్కహాల్​ కంపెనీల సాయమూ తీసుకుంది. అందులో 66 శాతం దేశాల్లో మందు తాగుతున్న పిల్లలు తగ్గుతున్నారని తేల్చింది. దానికి వాళ్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమేనని పేర్కొంది. ఈ జాబితాలో ఇండియా 29వ స్థానంలో ఉంది. చాలా దేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా తాగేస్తున్నారని రిపోర్టు తేల్చింది. మన దేశంలో 2005/2006తో పోలిస్తే ఇప్పుడు మందు తాగుతున్న అబ్బాయిలు 11 శాతం నుంచి 9 శాతానికి తగ్గారు. అమ్మాయిల విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. అప్పుడూ, ఇప్పుడూ ఒక శాతం మంది అమ్మాయిలు ఆల్కహాల్​ పట్టించేస్తున్నారు. ఇంగ్లాండ్​, స్కాట్లాండ్​, వేల్స్​లో మందు తాగుతున్న మిలీనియల్స్​ సంఖ్య 2010 నుంచి 2014 మధ్య 40 శాతానికి తగ్గింది. ఆస్ట్రేలియా, జర్మనీల్లోనూ దాదాపు అంతే ఉంది. అమెరికాలోనూ తగ్గినా, ఆశించినంతగా మాత్రం లేదు. అన్ని దేశాలతో పోలిస్తే మన దేశమే కొంచెం మెరుగ్గా ఉందని రిపోర్టు పేర్కొంది. మందు తాగుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు తక్కువగా ఉండడం మంచిదని చెప్పింది.

అక్కడ మాత్రం పెరిగింది

చాలా దేశాల్లో పిల్లల తాగుడు అలవాటు తగ్గినా మెక్సికో, డెన్మార్క్​, అర్జెంటీనా, థాయ్​లాండ్​ వంటి దేశాల్లో మాత్రం బాగా పెరిగిందని రిపోర్టు పేర్కొంది. డెన్మార్క్​లో తాగుడుకు వయోపరిమితి లేకపోవడంతో అక్కడ మిలీనియల్స్​ తెగ తాగేస్తున్నారని రిపోర్టు తేల్చింది. అక్కడే మందు తాగే మిలీనియల్స్​ ఎక్కువగా ఉన్నారని చెప్పింది. తాగే పిల్లలు కొంచెం తగ్గినా, ఇప్పటికీ అక్కడి సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. 2011లో 76 శాతం మంది మిలీనియల్స్​ మందుకు బానిసైతే, 2015కు కేవలం 3 శాతం తగ్గి 73 శాతం వద్ద ఉంది. చాలా దేశాల్లో తగ్గుతున్నా, పిల్లలు మందు తాగకుండా, వాళ్లకు మందు దొరక్కుండా ఇంకా చాలా చేయాల్సి ఉందని ఐఏఆర్​డీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ హెన్రీ యాశ్వర్త్​ చెప్పారు. దేశాల్లో తాగుడుకు వయోపరిమితిని పెడితే ఈ ట్రెండ్​ను ఇలాగే కొనసాగించొచ్చని, పిల్లలు మందు వైపు మళ్లకుండా చూడొచ్చని చెప్పారు.

Latest Updates